Google – Adani : అదానీ గ్రూప్, గూగుల్ జట్టు కట్టాయి. మనదేశంలో క్లీన్ ఎనర్జీ సరఫరాను పెంచడమే లక్ష్యంగా ఈ రెండు కంపెనీలు చేతులు కలిపాయి. అదానీ గ్రూప్‌నకు చెందిన ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి ప్లాంట్ గుజరాత్‌లో ఉంది. ఇందులో మొదలుకానున్న కొత్త ప్రాజెక్టులో కలిసి పనిచేసేందుకే అదానీ గ్రూప్, గూగుల్ జట్టుకట్టాయి. ఈవిషయంపై ఇరు కంపెనీలు సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. గుజరాత్‌లోని ఖవ్డాలో ఉన్న పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి ప్లాంటులో సరికొత్త సోలార్ అండ్ విండ్ హైబ్రిడ్ ఎనర్జీ ప్రాజెక్ట్ 2025 జూన్ తర్వాత కార్యకలాపాలు ప్రారంభిస్తుంది. ఈ ప్రాజెక్టులోనే గూగుల్, అదానీ గ్రూపులు కలిసి పనిచేయనున్నాయి. ఈ ప్రాజెక్టు వల్ల భారతదేశ గ్రిడ్‌కు మరింత స్వచ్ఛమైన విద్యుత్ అందుతుందని ఇరుకంపెనీలు వెల్లడించాయి.
Also Read :Iran Hit List : ఇజ్రాయెల్ టార్గెట్‌గా ఇరాన్ హిట్ లిస్ట్.. ఏ1గా బెంజమిన్ నెతన్యాహూ
ఖవ్డాలో ఉన్న పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి ప్లాంటులో సోలార్ పవర్, పవన్ విద్యుత్‌ను భారీగా ఉత్పత్తి చేస్తారు. ఇక్కడి ఉత్పత్తి అయ్యే విద్యుత్తును ఎప్పటికప్పుడు పారిశ్రామిక కారిడార్లకు, వాణిజ్య కస్టమర్లకు, కంపెనీలకు సప్లై చేస్తారు. దీనికి సంబంధించి ఆయా సంస్థలు గూగుల్ -అదానీ గ్రూప్(Google – Adani) జాయింట్ వెంచర్ ఒప్పందాలు కుదుర్చుకోనుంది. వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ విడుదలను సాధ్యమైనంత త్వరగా తగ్గించే మిషన్ కావడం వల్లే ఈ ప్రాజెక్టులో తాము అదానీ గ్రూపుతో కలిసి పనిచేసేందుకు అంగీకరించామని గూగుల్ వెల్లడించింది. యావత్ భారతదేశంలో స్వచ్ఛ విద్యుత్ ఉత్పత్తికి తమవంతుగా చేదోడును అందిస్తామని తెలిపింది. పర్యావరణానికి మేలు చేసే ప్రాజెక్టులను గూగుల్ తప్పకుండా ప్రోత్సహిస్తుందని పేర్కొంది. అదానీ గ్రూపు ఇలాంటి విశిష్ట విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టును చేపట్టడాన్ని గూగుల్ కొనియాడింది.టెక్నాలజీ ప్రపంచంలో రారాజుగా వెలుగొందుతున్న గూగుల్.. భారత విద్యుత్ ఉత్పత్తి రంగంలోకి అడుగుపెట్టడాన్ని కీలక పరిణామంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఈ పరిణామం అదానీ గ్రూపునకు కలిసొస్తుందని అంచనా వేస్తున్నారు.