YS Jagan: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటన ఉద్రిక్తతలకు దారితీసింది. పార్టీ కార్యకర్తలు, అభిమానులతో కూడిన ఈ పర్యటనలో ఒకవైపు ఆయన తన పార్టీ నాయకులను పరామర్శించగా, మరోవైపు రాష్ట్ర కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో చోటుచేసుకున్న ఘటనలు నెల్లూరులో రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి.
జగన్ ముందుగా నెల్లూరు సెంట్రల్ జైలుకు వెళ్లి, అక్కడ నిర్బంధంలో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిను కలిశారు. ఆ తరువాత మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఈ పర్యటనలో భారీ సంఖ్యలో వైసీపీ శ్రేణులు రోడ్లపైకి వచ్చారు. జగన్‌ను చూసేందుకు వచ్చిన జనసందోహం నియంత్రణ తప్పడంతో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది. దీంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Russia-USA : రష్యా-అమెరికా మధ్య ఉద్రిక్తతలు.. ట్రంప్ అణు జలాంతర్గాముల నిర్ణయం కలకలం
ఈ ఘటనల తరువాత వైసీపీ నేతలపై వరుస కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రి గోడను కూల్చేశారని ఆరోపిస్తూ దర్గామిట్ట పోలీస్ స్టేషన్‌లో ఒక కేసు, అనుమతి లేకుండా బైక్ ర్యాలీ నిర్వహించారని మరో కేసు నమోదు చేశారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డిపై రెండు కేసులు ఉండగా, తాజా కేసులతో కలిపి మొత్తం నాలుగు కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఈ చర్యలను వైసీపీ నేతలు రాజకీయ వేధింపులుగా అభివర్ణించారు.
జగన్ ఈ పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. “నా పార్టీ నాయకుడిని పరామర్శించడానికి కూడా నేను వెళ్ళకూడదా? నా పర్యటనలకు ఇన్ని ఆంక్షలు ఎందుకు? ప్రజలను అడ్డుకోవడానికి రోడ్లను తవ్వించడం, రెండు వేల మంది పోలీసులను మోహరించడం ఎందుకు?” అని ప్రశ్నించారు. ఆయన చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం భయంతోనే ఇలాంటి చర్యలకు దిగుతోందని ఆరోపించారు. “ప్రభుత్వం మంచిగా పాలిస్తే ఇంత భయం ఎందుకు? విద్యా, వైద్య రంగాలను నాశనం చేశారు. ప్రసన్న ఇంట్లోకి టీడీపీ గూండాలు దూసుకెళ్లి బీభత్సం సృష్టించారు. మా మహిళా నేతలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఏ తప్పు చేశాడని కాకాణిని జైలులో పెట్టారు?” అంటూ జగన్ ఫైర్ అయ్యారు.
జగన్ వ్యాఖ్యలపై కూటమి నేతలు, ముఖ్యంగా టీడీపీ మంత్రులు , ఎమ్మెల్యేలు, సైతం ఘాటుగా స్పందించారు. జగన్ పర్యటన రాష్ట్రంలో ఉద్రిక్తత సృష్టించడానికే ఉద్దేశ్యమని, అశాంతికి వైసీపీనే కారణమని వారు ఆరోపించారు. ఈ ఆరోపణలు, ప్రతివాదనలు నెల్లూరులో రాజకీయ ఘర్షణను మరింత ముదిర్చాయి.