YS Jagan – Sharmila : సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, ఆ పార్టీ నేతలకు బిగ్‌షాక్ తగలబోతుందా? మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా వైసీపీ పరిస్థితి మారబోతుందా.. అంటే అవుననే సమాధానం ఏపీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. జగన్ సోదరి, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వైసీపీ ఓటు బ్యాంకుకు గండికొట్టేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా వైఎస్ఆర్ రాజకీయ వారసత్వాన్ని నేనే అంటూ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో వైఎస్ఆర్ జయంతిని వేదికగా వినియోగించుకునేందుకు షర్మిల రెడీ అయ్యారు. నేడు జులై 8న (సోమవారం) దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జయంతిని ప్రతీయేటా వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అయితే, ఈసారి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో విజయవాడ వేదికగా వైఎస్ఆర్ జయంతి వేడుకలను నిర్వహించేందుకు షర్మిల ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జాతీయ స్థాయి నేతలతోపాటు తెలుగు రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ముఖ్యనేతలు పాల్గోబోతున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక డిప్యూటీ సీఎం సైతం వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో పాల్గోనున్నారు.
వైఎస్ఆర్ మరణం తరువాత కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు. 2014 ఎన్నికల్లో ఓటమిపాలైన జగన్.. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారు. జగన్ గెలుపులో కీలక భూమిక పోషించింది వైఎస్ఆర్ అభిమానులే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సీఎంగా కొనసాగిన కాలంలో పెద్ద సంఖ్యలో ప్రజాదరణ పొందారు. మతాలు, కులాలకు అతీతంగా వైఎస్ఆర్‌కు అభిమానులు ఉన్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ అభిమానులు ఏకతాటిపైకి వచ్చి జగన్ మోహన్ రెడ్డితోనే మళ్లీ వైఎస్ఆర్ పాలన సాధ్యమవుతుందని భావించి భారీ మెజార్టీతో అధికారాన్ని కట్టబెట్టారు. కానీ, ఐదేళ్ల కాలంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తరహా పాలన అందించడంలో జగన్ మోహన్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యారు. దీనికి తోడు షర్మిల, వైఎస్ఆర్ సతీమణి విజయమ్మను పార్టీకి దూరం చేసుకున్నారు. వైసీపీ నుంచి బయటకు వచ్చిన షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినప్పటికీ కొద్దికాలంకే దానిని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఆ తరువాత ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలో జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం షర్మిల పనిచేశారు. ఈ క్రమంలో వైఎస్ఆర్ రాజకీయ వారసత్వాన్ని నేనని షర్మిల ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు.
ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమితో అధికారాన్ని కోల్పోయింది. ఎన్నికల్లో కొంతభాగం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు వైసీపీకి దూరమయ్యారు. వారితోపాటు, ఏపీలో వైఎస్ఆర్ అభిమానులను కాంగ్రెస్ వైపుకు మళ్లించేందుకు షర్మిల వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. వైఎస్ఆర్ జయంతిని పెద్దెత్తున నిర్వహించడం ద్వారా తానే వైఎస్ఆర్ రాజకీయ వారసత్వాన్ని అని చాటి చెప్పేందుకు షర్మిల ప్రయత్నం చేయబోతున్నారు. ఈ ప్రయత్నంలో షర్మిల విజయవంతం అయితే వైసీపీకి రాజకీయంగా గడ్డు పరిస్థితులు తప్పవని ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. షర్మిల వ్యూహం సఫలం కాకుండా అడ్డుకునేందుకు జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నాలు షురూ చేశారు. కడప టూర్‌లో ఉన్న జగన్.. వైఎస్ఆర్ జయంతి వేడుకలను అక్కడ ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణుల్లో వైఎస్ఆర్ జయంతి వేడుకలను పెద్దెత్తున నిర్వహించాలని ఇప్పటికే పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ రాజకీయ వారసత్వం నాదంటే నాదంటూ జగన్, షర్మిల మధ్య జరుగుతున్న పోరులో చివరికి ఎవరిది పైచేయి అవుతుందనే అంశం ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
Also Read : Sonia Gandhi : వైఎస్సార్ జయంతి వేళ సోనియాగాంధీ కీలక సందేశం.. షర్మిల థ్యాంక్స్