YCP Special status : BJPతో కాపురం, కాంగ్రెస్ తో ప్రేమాయ‌ణం!జ‌గ‌న్ ల‌క్ !!

YCP Special status : `ప్ర‌త్యేక హోదా ఎవ‌రిస్తే వాళ్ల‌కు వైసీపీ మ‌ద్ధ‌తు ఉంటుంది. రాజకీయాల‌కు అతీత‌మైన బంధం మోడీతో ఉంది.`

  • Written By:
  • Publish Date - September 4, 2023 / 01:59 PM IST

YCP Special status : `ప్ర‌త్యేక హోదా ఎవ‌రిస్తే వాళ్ల‌కు వైసీపీ మ‌ద్ధ‌తు ఉంటుంది. రాజకీయాల‌కు అతీత‌మైన బంధం మోడీతో ఉంది.` ఈ రెండు విష‌యాలు ప‌లుమార్లు సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చెప్పారు. అంతేకాదు, అల్లూరు సీతారామ‌రాజు విగ్ర‌హం ప్రారంభ‌హోత్స‌వం సంద‌ర్భంగా న‌రేంద్ర మోడీ ఎదుటే రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం ఏ కూట‌మితోనైనా చేతులు క‌లుపుతా? అంటూ ప్ర‌క‌టించారు. బ‌హుశా న‌రేంద్ర మోడీకి తెలుగు రాదు కాబ‌ట్టి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ్యాఖ్య‌ల్లోని ఆంత‌ర్యం అర్థం కాక‌పోయి ఉండొచ్చు. కానీ, ఏపీ బీజేపీ నేత‌లు అక్క‌డే ఉన్నారు. ఆ త‌రువాత అయినా మోడీకి చెప్ప‌కుండా ఉంటారా? అంటే ఏమో..! గుర్రం ఎగ‌రావ‌చ్చు అనే స‌మాధానం అప్ప‌ట్లో వినిపించింది.

ప్ర‌మాణ‌స్వీకారం రోజే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కేంద్ర ప్ర‌భుత్వం మీద..(YCP Special status)

ప్ర‌మాణ‌స్వీకారం రోజే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కేంద్ర ప్ర‌భుత్వం మీద త‌న అభిప్రాయాన్ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. పూర్తి మెజార్టీతో ఏర్ప‌డిన మోడీ స‌ర్కార్ ను ప్ర‌త్యేక‌హోదా  (YCP Special status )గురించి అభ్య‌ర్థించ‌డం మిన‌హా ఏమీ చేయ‌లేమ‌ని అన్నారు. బ్యాడ్ లక్ పూర్తి మెజార్టీతో కేంద్ర ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌డం అంటూ వ్యాఖ్యానించారు. అదే సంద‌ర్భంగా మోడీ, అమిత్ షా ల‌కు తెలియ‌కుండా రాష్ట్రంలో ఏమీ చేయ‌లేని ప‌రిస్థితి అంటూ ప‌రోక్షంగా సంకేతాలు ఇచ్చారు. కేంద్రానికి చెప్పిన త‌రువాత ఏదైనా రాష్ట్రంలో చేస్తున్నామ‌ని ఎంపీ హోదాలో విజ‌య‌సాయిరెడ్డి అప్ప‌ట్లో ప్ర‌క‌టించారు. అంటే కేంద్రంతో ఉంటూనే ప‌రిస్థితుల‌కు అనుగుణంగా ప్ర‌త్యేక హోదాను సాధించుకోవాల‌ని అనే భావం వినిపిస్తూ దేవుడి ద‌యకు వ‌దిలేశారు.

ప్ర‌త్యేక‌హోదా   గురించి అభ్య‌ర్థించ‌డం

`జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మ‌నోడే, ఎన్నిక‌ల త‌రువాత ఎంపీల మ‌ద్ధ‌తు ఇస్తాన‌ని హామీ ఇచ్చాడు.` అంటూ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాని కార్య‌ద‌ర్శి కేసీ వేణుగోపాల్ ఇటీవ‌ల ఢిల్లీ వెళ్లిన ష‌ర్మిల వ‌ద్ద వ్య‌క్త‌ప‌రిచిన‌ట్టు తాజాగా జ‌రుగుతోన్న ప్ర‌చారం. వాస్త‌వంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎప్పుడో చెప్పాడు. ప‌త్యేక హోదా  (YCP Special status)ఎవ‌రిస్తే, వాళ్ల‌కు మ‌ద్ధ‌తు ఇవ్వ‌డానికి వైసీపీ సిద్ధమ‌ని. ఇప్పుడేదో కొత్త‌గా చెప్పిన‌ట్టు ప్ర‌చారం మొద‌లు కావ‌డం విచిత్రం. ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని కాంగ్రెస్ ప్ర‌క‌టించింది. ఆ పార్టీ ఉండే కూట‌మిని ఒప్పించ‌డం ద్వారా ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని భార‌త్ జోడో యాత్ర సంద‌ర్భంగా రాహుల్ హామీ ఇచ్చారు. అంటే, వైసీపీ మ‌ద్ధ‌తు ఉంటుంద‌ని కాంగ్రెస్ పార్టీ స‌హ‌జంగానే భావించ‌డానికి అవకాశం ఉంటుంది.

Also Read : CM Jagan: కుటుంబసమేతంగా లండన్‌ వెళ్లిన సీఎం జగన్

ఏదో కుట్ర‌కోణంలో కాంగ్రెస్ పార్టీతో చేతులు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి క‌లిపార‌ని అనుకుందాం. ఆ విష‌యం బీజేపీకి తెలియ‌దా? అంత బ‌ల‌హీనంగా బీజేపీ నిఘా వ్య‌వ‌స్థ ఉందా? అంటే లేద‌ని చెప్పాలి. ఎందుకంటే, దేశ వ్యాప్తంగా చీమ‌చిటుక్కుమ‌న్నా, వెంట‌నే బీజేపీ పెద్ద‌ల‌కు స‌మాచారం చేరిపోతోంది. అంత బ‌లంగా నిఘా వ‌ర్గాలు ఉండ‌డం కార‌ణంగా ఆయా రాష్ట్రాల్లోని బీజేపీయేత‌ర పార్టీల‌ను కూడా గ‌డ‌గ‌డ‌లాడిస్తున్నారు. పైగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పూర్తి బ‌యోడేటా బీజేపీ పెద్ద‌ల వ‌ద్ద ఉంది. ఆయ‌న కేసుల నుంచి పూర్తి స‌మాచారం ఉంటుంది. కానీ, బీజేపీ తెలియ‌కుండా కాంగ్రెస్ పార్టీతో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేతులు క‌లిపార‌ని వ‌చ్చిన ప్ర‌చారంపై వైసీపీ నేత‌లు ప‌ట్టించుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

పార్ల‌మెంట్ వేదిక‌గా బ‌య‌ట నుంచి మోడీ స‌ర్కార్ కు మ‌ద్ధ‌తు

తొలి నుంచి ఏ పార్టీతోనూ సంబంధంలేద‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అండ్ టీమ్ చెబుతోంది. ప్ర‌త్యేక హోదా (YCP Special status)ఇచ్చే పార్టీతో ఉంటాం అంటూ స్ప‌ష్టం చేసింది. అదే త‌ర‌హాలో బీజేపీ, కాంగ్రెస్ కూట‌ముల‌కు స‌మదూరాన్ని పాటిస్తోంది. పార్ల‌మెంట్ వేదిక‌గా బ‌య‌ట నుంచి మోడీ స‌ర్కార్ కు మ‌ద్ధ‌తు ఇస్తోంది. అందుకు ప్ర‌తిఫ‌లంగా బ‌ట‌న్ నొక్క‌డానికి అవ‌స‌ర‌మైన అప్పుల‌ను తీసుకుంటుంది. ఇంత‌కు మిన‌హా ఏ పార్టీతోనే వైసీపీ జ‌త‌క‌ట్ట‌లేదు. ఎన్డీయే భాగ‌స్వామ్యం కావాల‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మీద ఒత్తిడి వ‌చ్చింది. కేంద్ర మంత్రివ‌ర్గంలో స్థానంతో పాటు కీల‌క ప‌ద‌వుల‌ను ఆఫ‌ర్ చేసింది. కానీ, వైసీపీ సున్నితంగా తిర‌స్క‌రించింది. ఇలాంటి ప‌రిస్థితుల్లో కొత్త‌గా కాంగ్రెస్ పార్టీకి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇచ్చిన ఆఫ‌ర్ ఏమిటో అర్థం కావ‌డంలేదు.

Also Read : Delhi CEC : TDP, YCPప‌ర‌స్ప‌ర ఫిర్యాదు!YCP ర‌ద్దుకు CBN డిమాండ్!!

బీజేపీకి దూరం అవుతూ కాంగ్రెస్ పార్టీకి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ద‌గ్గ‌ర‌వుతున్నారు? అనే ప్ర‌చారం వైసీపీకి ఎంతో కొంత మేలే. ఎందుకుంటే, బీజేపీతో ఉన్నారని ప్ర‌చారం క్ర‌మంలో ముస్లిం, క్రిస్ట‌య‌న్లు కొంద‌రు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి దూరం అయ్యే అవ‌కాశం ఉంది. ఇప్పుడు ఆ దూరం పోయే ఛాన్స్ లేక‌పోలేదు. పైగా బీజేపీకి నెగిటివ్ ఎక్కువ‌గా ఏపీలో ఉంది. ఆ పార్టీ అంటేనే మండిప‌డుతున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నెత్తిన పాలుపోసేలా బీజేపీకి దూర‌మ‌వుతున్నారు అనే ప్ర‌చారం మొద‌లైయింది. ఎంతో కొంత ఈ ప్ర‌చారం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి క‌లిసొచ్చేలా క‌నిపిస్తోంది. అంతేకాదు ప్ర‌త్యేక హోదా కోసం కాంగ్రెస్ కు ద‌గ్గ‌ర‌వుతున్నార‌నే అభిప్రాయం వైసీపీకి లాభం చేకూరే ఛాన్స్ ఉంది. మొత్తం మీద టీడీపీ సానుకూల మీడియా చేస్తోన్న ప్ర‌చారం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గ్రాఫ్ ను పెంచేలా ఉంద‌న‌డంలో సందేహం లేదు.