ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కొనసాగుతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాష్ట్రంలో ఇవాళ మేఘావృతమైన వాతావరణంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలు, కోనసీమ, ఏలూరు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈదురు గాలులు వీస్తాయని, ప్రజలు చెట్ల క్రింద, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడొద్దని సూచించారు. శనివారం రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంతేకాదు బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అంటున్నారు. నైరుతి రుతుపవనాలు గురువారం రోజు దేశమంతటా విస్తరించాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌లో మోస్తరు మినహా పెద్దగా వర్షాలు పడలేదు. రాష్ట్రంపై ఎల్‌నినో ప్రభావం బాగా కనిపిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వానలు ఊపందుకుంటాయని భావించినా, అవి పెద్దగా ప్రభావం చూపించలేదు. వర్షాల విషయంలో పరిస్థితి ఇలాగే కొనసాగితే కష్టాలు తప్పవని రైతులు ఆందోళనలో ఉన్నారు. ఖరీఫ్ పంటలపై ప్రభావం ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులు మాత్రం ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం కూడా ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పిస్తోంది.
వాస్తవానికి రుతుపవనాలు జులై ఎనిమిది కల్లా దేశమంతా విస్తరించాల్సి ఉండగా, ఒకరోజు ఆలస్యమైందని చెబుతున్నారు. నైరుతి రుతుపవనాలు గత నెల 4న కేరళలోకి ప్రవేశించాయి. ఆ తర్వాత కూడా నిదానంగా విస్తరించాయి. ఇది ఎల్‌నినో ప్రభావమని చెబుతున్నారు. గత నెలలో ఎల్‌నినో కారణంగా దేశవ్యాప్తంగా 40 శాతం తక్కువ వర్షపాతం నమోదు కావడంతో రైతులపై ప్రభావం కనిపించింది. ఖరీఫ్ పంటల సాగుపై రైతన్నలు ఆందోళనలో ఉన్నారు. ఈ నెల 2న బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడటంతో పలు రాష్ట్రాల్లో వర్షాలు పడ్డాయి. అలాగే ఉత్తరాదిలోని పలు రాష్ట్రాలను వానలు ముంచెత్తాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో రెండు రోజుల వ్యవధిలో కుంభవృష్టి కురిసింది.
