Site icon HashtagU Telugu

Amaravati : ఏపీ ప్రజలతో కలిసి యోగా డేలో పాల్గొంటా : ప్రధాని మోడీ

Will participate in Yoga Day with the people of AP: Prime Minister Modi

Will participate in Yoga Day with the people of AP: Prime Minister Modi

Amaravati : ప్రధాని మోడీ అమరావతి పునఃనిర్మాణ పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ప్రధాని మోడీ ప్రసంగించారు. తన ప్రసంగాన్ని తెలుగులో మొదలు పెట్టిన ప్రధాని.. ‘దుర్గాభవానీ కొలువైన పుణ్యభూమిలో మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది’ అన్నారు. అమరావతి నిర్మాణానికి పూర్తిస్థాయిలో సహకరిస్తామన్నారు. రాష్ట్రంలో కనెక్టివిటీకి కొత్త అధ్యాయం మొదలైందని వ్యాఖ్యానించారు. అమరావతి ఒక నగరం కాదు.. ఒక శక్తి అని ప్రధాని మోడీ అన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్‌కు ఇది శుభసంకేతమని చెప్పారు. వికసిత్ భారత్‌కు ఏపీ గ్రోత్‌ ఇంజిన్‌గా ఎదగాలని ప్రధాని ఆకాంక్షించారు. గత పదేళ్లలో అమరావతికి కేంద్రం మద్దతుగా నిలిచింది. అభివృద్ధికి అన్ని రకాలుగా సహకరించింది. ఇప్పుడూ అమరావతి అభివృద్ధికి కేంద్రం సహకారం కొనసాగుతుంది. అమరావతిలో అన్ని రకాల నిర్మాణాలకు కేంద్రం తోడ్పాటు అందిస్తుంది అన్నారు.

Read Also:PM Modi: సీఎం చంద్ర‌బాబుపై ప్ర‌ధాని మోడీ ప్ర‌శంస‌లు..! 

నేను గుజరాత్‌ సీఎం అయ్యాక హైదరాబాద్‌లో ఐటీని ఎలా అభివృద్ధి చేశారో తెలుసుకున్నా. అధికారుల్ని పంపించి హైదరాబాద్‌ ఐటీ అభివృద్ధిని అధ్యయనం చేయించా. పెద్ద ప్రాజెక్టులు చేపట్టాలన్నా త్వరగా పూర్తి చేయాలన్నా చంద్రబాబుకే సాధ్యం. పెద్ద పెద్ద పనుల్ని చేపట్టి పూర్తి చేయడంలో చంద్రబాబును మించిన నేత దేశంలో లేరు. 2015లో ప్రజా రాజధానిగా అమరావతికి శంకుస్థాపన చేశా అన్నారు. ఇవి కేవలం కాంక్రీటు నిర్మాణాలు కాదు.. ఏపీ ప్రగతి, ఆశలు, వికసిత్‌ భారత్‌ ఆశయాలకు బలమైన పునాది వేయబోతోంది. వీరభద్ర స్వామి, అమరలింగేశ్వరస్వామి, తిరుపతి వెంకటేశ్వరస్వామికి పాదాలకు నమస్కరిస్తూ ఏపీ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. చంద్రబాబు, పవన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు.

భారత శక్తి అంటే కేవలం మన ఆయుధాలే కాదు.. మన ఐక్యత కూడా. విశాఖలో యునిటీమాల్‌ అభివృద్ధి చేస్తున్నాం. వికసిత్‌ భారత్‌ నిర్మాణం కావాలంటే మహిళలు, కార్మికులు అభివృద్ధి చెందాలి. ఈ నాలుగు వర్గాలు నాలుగు స్తంభాలు లాంటివారు. రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తున్నాం. నాగాయలంకలో టెస్టింగ్‌ రేంజ్‌.. దుర్గామాత లాగా భారత రక్షణ రంగానికి శక్తినిస్తుంది. శ్రీహరికోట నుంచి ప్రయోగించే ప్రతి రాకెట్‌ కోట్లాది భారతీయులకు గర్వకారణం అన్నారు. మూడేళ్లలో అమరావతి పనుల్ని పూర్తి చేస్తామని సీఎం అన్నారు. ఆ పనులు పూర్తయ్యాక ఏపీ జీడీపీ ఏ స్థాయికి వెళ్తుందో నేను ఊహించగలను. అది ఏపీ రాష్ట్రం చరిత్ర గతిని మార్చబోతోందన్నారు.

ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలకు రైల్వే బడ్జెట్‌ రూ.900 కోట్ల లోపే ఉండేది. ఇప్పుడు కేవలం ఏపీకే రూ.9వేల కోట్ల రైల్వే నిధులు ఇచ్చాం. ఏపీకి గతం కంటే పది రెట్లు అధికంగా నిధులు కేటాయించాం. గత పదేళ్లలో ఏపీలో 750 రైల్వే బ్రిడ్జ్‌లు, అండర్‌పాస్‌లు నిర్మించాం అన్నారు. విశాఖలో జూన్‌ 21న జరగనున్న యోగా డేలో పాల్గొంటాను. నన్ను ఆహ్వానించినందుకు ప్రభుత్వానికి థ్యాంక్స్‌. మన యోగాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. వచ్చే 50 రోజులూ ఏపీలో యోగాకు అనుకూల వాతావరణం కల్పించాలి. ఏపీలో కలలు కనేవాళ్ల సంఖ్య తక్కువేం కాదు.. ఆ కలల్ని నిజం చేసేవారి సంఖ్యా తక్కువకాదు. ఏపీ సరైన మార్గంలో నడుస్తోంది. సరైన వేగంతో ముందుకెళ్తోంది. దీన్ని కొనసాగించాలని ప్రధాని మోడీ అన్నారు.

Read Also: Hyundai Motor India : మూడు మిలియన్ల అమ్మకాల మైలురాయిని అధిగమించిన హ్యుందాయ్ మోటర్ ఇండియా