Ratnachal Express : రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసు మొదలై అప్పుడే 30 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ రైలు విజయవాడ – విశాఖ నగరాలను చేరువ చేయడంలో కీలక పాత్ర పోషించింది. సత్యనారాయణ స్వామి కొలువైన రత్నగిరి కొండల పేరిట ఈ రైలుకు రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌గా నామకరణం చేశారు.
రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ సర్వీసుల విశేషాలివీ..
- 1994 అక్టోబర్ 2న రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ సర్వీసు విజయవాడ-విశాఖపట్నం మధ్య మొదలైంది.
- ట్రైన్ నంబరు 17246/17245గా మొదలైన రత్నాచల్ ఎక్స్‌ప్రెస్(Ratnachal Express) విజయవాడ, విశాఖపట్నం నగరాల మధ్య నడిచే ముఖ్యమైన రైలుగా పేరుగాంచింది.
- 1999లో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను సూపర్ ఫాస్ట్ సర్వీసుగా అప్‌గ్రేడ్ చేశారు. దీంతో అది 2718/2717ఇంటర్ సిటీగా మారింది. ఫలితంగా ప్రయాణ వేగం పెరిగింది. ప్రయాణికుల సౌకర్యాలు పెరిగాయి.
- 2006 సంవత్సరంలో రత్నాచల్ రైలును ఆధునిక సీబీసీ రేక్‌లతో అప్‌గ్రేడ్ చేశారు.
- తొలుత రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను 24 కోచ్‌ల తో WAM4 ఇంజిన్‌తో నడిపేవారు. తర్వాతి కాలంలో దీన్ని LGD WAP4 ఇంజిన్‌కు అప్‌గ్రేడ్ చేశారు. ప్రస్తుతం ఈ రైలు అత్యాధునిక LGD WAP7 ఇంజిన్‌తో నడుస్తోంది.
- రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు విజయవాడ నుంచి ఒకే సమయంలో విశాఖపట్నం, సికింద్రాబాద్, చెన్నైలకు ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు బయలుదేరుతుంటాయి.
- పినాకిని ఎక్స్‌ప్రెస్, శాతవాహన ఎక్స్‌ప్రెస్ కూడా రోజువారీ ప్రయాణికులకు ఎంతో సౌలభ్యాన్ని అందించాయి.
- రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రోజువారీ ఆక్యుపెన్సీ 140 శాతానికిపైనే ఉంటుంది. దీన్నిబట్టి ఈ రైలు సర్వీసుకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
- రోజూ ఎంతోమంది విద్యార్ధులు,ఉద్యోగులు, వ్యాపారులు ఈ రైలులో రాకపోకలు సాగిస్తుంటారు.
- మొత్తం మీద రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌తో విజయవాడ, విశాఖ సహా ఏపీలోని ముఖ్య నగరాల ప్రజలకు మంచి అనుబంధం ఏర్పడింది. నిత్యం ఇందులో రాకపోకలు సాగిస్తూ ప్రజలు అలవడిపోయారు.