Vijayawada : బెజవాడలో థార్ కారు కేసులో ఇద్దరు యువకులను రిమాండ్‌కు తరలించారు. రాజకీయ అండదండలున్నప్పటికీ పోలీసులు తలొగ్గకుండా ఇద్దరిపై చర్యలు తీసుకున్నారు. నడిరోడ్డుపై రౌడీయిజం చేసిన ఈ ఇద్దరు యువకులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. పటమట హైటెన్షన్ రోడ్డుపై రాత్రి పూట థార్ (THAR CAR) కార్లతో రణరంగం సృష్టించారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న బెజవాడ పోలీసులు ఇద్దరి యవకులను కటకటాల వెనక్కి పంపారు. డ్రగ్స్ మత్తులో, ఒకే అమ్మాయి కోసం స్నేహితులే శత్రువులుగా మారి బెజవాడ రోడ్లపై స్వైర విహారం చేస్తూ ప్రజలను భయభ్రంతులకు గురి చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. నిందితులిద్దరికీ 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ప్రస్తుతం వీరిద్దరని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు
ఈ కేసులో ఏ1 గా బొల్లా ఓం (బొల్లా ఓంకార్) ని చేర్చగా.. ఏ2గా రోహిత్ లింగమనేనిని చేర్చారు. బొల్లా ఓంకార్‌కు డ్రగ్ టెస్ట్‌లో పాజిటివ్ అని తేలడంతో అతనిపై నార్కోటిక్ కేసు కూడా పోలీసులు నమోదు చేశారు. ఏ2గా ఉన్న రోహిత్ లింగమనేని.. ఘటనా స్థలం నుండి పారిపోవాలని చూసినా, చట్టం వదల్లేదు. కారులో జిమ్ బాడీ కోసం వాడే స్టెరాయిడ్స్, ఈ-సిగరెట్లతో రోహిత్ అడ్డంగా దొరికిపోయాడు కేవలం కార్లు గుద్దుకోవడంతోనే ఈ వ్యవహారం ముగియలేదు. వీరి కార్లను తనిఖీ చేసిన పోలీసులకు మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు దొరికాయి. ఒకరి కారులో హాకీ స్టిక్స్, ఇనుప రాడ్లు బయటపడితే… మరొకరి కారులో ఏకంగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు దొరకడం విజయవాడలో కలకలం రేపుతోంది. ఏ1 బొల్లా ఓంకార్ వెనుక మాజీ మంత్రి జోగి రమేష్ పేరు, వైకాపా రాజకీయ బలగం ఉందంటూ ప్రచారం సాగినప్పటికీ… పోలీసులు ఎక్కడా తగ్గలేదు. పటమట నివాసితుల గుండెల్లో భయం పుట్టించిన ఈ ‘థార్ గ్యాంగ్’కు కోర్టు రిమాండ్ విధించడంతో పోలీసుల పనితీరుపై స్థానికులు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
