BJP Big Plan: ఆంధ్రప్రదేశ్‌లోని ఉభయ గోదావరి జిల్లాలపై బీజేపీ గురిపెట్టింది. వాటికి ఆర్థిక రాజధానిగా పేరొందిన భీమవరంపై స్పెషల్ ఫోకస్‌తో ముందుకు సాగుతోంది. ఈక్రమంలోనే పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన బీజేపీ నేత పాకా సత్యనారాయణకు ఇటీవలే రాజ్యసభ సీటు దక్కింది. సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం ఎంపీగా ఎన్నికైన బీజేపీ నేత భూపతి రాజు శ్రీనివాసవర్మకు కేంద్ర సహాయ మంత్రిగా అవకాశం లభించింది. బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు రాజమండ్రికి చెందిన సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ పదవి దక్కింది. వీరంతా మొదటి నుంచీ బీజేపీలో ఉన్నసీనియర్ నేతలే. ఏపీలో పార్టీకి విధేయంగా ఉన్నవారికి అవకాశాలు కల్పించడానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రయారిటీ ఇస్తున్నారు. పాకా సత్యనారాయణ, భూపతి రాజు శ్రీనివాసవర్మ, సోము వీర్రాజులకు దక్కిన అవకాశాలే అందుకు సంకేతం. పాకా సత్యనారాయణ 45 సంవత్సరాలుగా బీజేపీలో పనిచేస్తుంటే, శ్రీనివాస వర్మకు బీజేపీతో 35 ఏళ్లుగా అనుబంధం ఉంది.
Also Read :ATM Charges Hike: నేటి నుంచే ఏటీఎం ఛార్జీల పెంపు.. ఎంత ?
సామాజిక వర్గాలవారీగా..
పశ్చిమగోదావరి జిల్లాలోని కీలక సామాజిక వర్గాలను తమకు చేరువ చేసుకోవడంపై బీజేపీ దృష్టి పెట్టింది. తాజాగా రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని దక్కించుకున్న పాకా సత్యనారాయణ భీమవరంలోని గౌడ సామాజిక వర్గం నేత. భూపతి రాజు శ్రీనివాసవర్మ క్షత్రియ వర్గం నేత. సోమువీర్రాజు కాపు వర్గం నేత. ఈ మూడు సామాజిక వర్గాలు తమకు చేరువైతే వచ్చే ఎన్నికల నాటికి ఉభయ గోదావరి జిల్లాల్లో ఆశాజనక స్థాయిలో అసెంబ్లీ సీట్లను గెల్చుకోవచ్చని బీజేపీ భావిస్తోంది.
Also Read :AP DGP : ఏపీ డీజీపీగా హరీశ్‌కుమార్ గుప్తా.. నేపథ్యమిదీ
భారీ మెజారిటీతో ఓటుబ్యాంకు..
గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నరసాపురం పార్లమెంటు స్థానంలో బీజేపీ(BJP Big Plan) ఎంపీ అభ్యర్థి భూపతి రాజు శ్రీనివాస వర్మ దాదాపు రెండు లక్షల 75 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. దీన్నిబట్టి అక్కడ బీజేపీకి బలమైన ఓటుబ్యాంకు ఏర్పడింది. ఇదే ట్రెండును కొనసాగిస్తూ.. ఉభయ గోదావరి జిల్లాల్లోని అసెంబ్లీ స్థానాలపైనా పట్టు సంపాదించాలని బీజేపీ యోచిస్తోంది. తద్వారా వచ్చే ఎన్నికల నాటికి ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో క్షేత్రస్థాయిలో బలపడాలని, క్యాడర్‌ను పెంచుకోవాలని భావిస్తోంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లోని 8 ఎమ్మెల్యే సీట్లను బీజేపీ గెల్చుకుంది. వచ్చే ఎన్నికల్లో ఈ సంఖ్యను 24కు చేర్చాలనే పట్టుదలతో బీజేపీ పెద్దలు ఉన్నారు. ఆ దిశగానే స్కెచ్ అమలవుతోంది. వచ్చే ఎన్నికల నాటికి వైఎస్సార్ సీపీ నుంచి బలమైన నేతలను తమ వైపునకు తీసుకొని ఈ టార్గెట్‌ను పూర్తి చేయాలని ప్లాన్లు రెడీ చేస్తున్నారు.