Amaravati: అమరావతిలో అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం

ఏపీ రాజధాని అమరావతిలో 4,618 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాలని ప్లాన్ చేశారు. తాడికొండ మండలం రావెల సమీపంలో స్థలం గుర్తించినట్లు తెలుస్తోంది. అక్కడ గ్రామాల్ని తరలించకుండా స్థల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భూసమీకరణా, సేకరణా అనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ ఎయిర్‌పోర్ట్‌ను తొలి దశలో రూ.3,409 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్నారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు పక్కనే ఈ ఎయిర్‌పోర్ట్ స్థలాన్ని ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతి అభివృద్ధిపై దృష్టి […]

Published By: HashtagU Telugu Desk
The Largest International Airport in Amaravati

The Largest International Airport in Amaravati

ఏపీ రాజధాని అమరావతిలో 4,618 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాలని ప్లాన్ చేశారు. తాడికొండ మండలం రావెల సమీపంలో స్థలం గుర్తించినట్లు తెలుస్తోంది. అక్కడ గ్రామాల్ని తరలించకుండా స్థల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భూసమీకరణా, సేకరణా అనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ ఎయిర్‌పోర్ట్‌ను తొలి దశలో రూ.3,409 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్నారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు పక్కనే ఈ ఎయిర్‌పోర్ట్ స్థలాన్ని ఎంపిక చేశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతి అభివృద్ధిపై దృష్టి పెట్టింది. సచివాలయం, హైకోర్టు సహా భవనాల నిర్మాణ పనుల్ని వేగవంతం చేశారు. అలాగే పలు కంపెనీలు, హోటల్స్, బ్యాంకులు, ఆస్పత్రులు.. ఇలా ఎన్నో నిర్మాణాలు మొదలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో మౌలిక సదుపాయాలు, రవాణాపై కూడా దృష్టి పెట్టింది. త్వరలోనే గుంటూరు నుంచి అమరావతికి ఎలక్ట్రిక్ బస్సుల్ని నడిపేందుకు సిద్ధమవుతున్నారు. రాజధానిలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. స్థలం ఎంపికపై కసరత్తు జరుగుతోంది.

అమరావతి పరిధిలోని గుంటూరు జిల్లా తాడికొండ మండలంలోని రావెల దగ్గర ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కోసం 4,618 ఎకరాల భూమి అనువైనదిగా గుర్తించినట్లు తెలుస్తోంది. రాజధానితో పాటుగా గుంటూరు, విజయవాడలకు కనెక్టివిటీ ఉండేలా ఈ ప్రాంతం బాగుంటుందని నిర్ణయించినట్లు సమాచారం. ఎయిర్‌పోర్ట్ కోసం ప్రతిపాదించిన భూమి అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో, రాష్ట్ర సచివాలయానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. గతంలో హైదరాబాద్‌ శంషాబాద్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కోసం అక్కడి గ్రామాలను తరలించిన సంగతి తెలిసిందే. అమరావతిలో మాత్రం విమానాశ్రయం కోసం గ్రామాలను తరలించకుండా ఆ గ్రామాలను అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలని భావిస్తున్నారు. అందుకే స్థలం ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అలాగే అమరావతిలో ఎయిర్‌పోర్ట్ కోసం ఎంపిక చేసిన భూములు అమరావతి రెండో విడత భూసమీకరణలో లేకపోవడంతో, ఈ భూముల్ని ఎలా తీసుకుంటారనే చర్చ జరుగుతోంది. ఈ భూముల్ని భూసమీకరణలో భాగంగా తీసుకుంటారా లేదా భూసేకరణ చేపడతారా అనేది చూడాలి. రైతులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత త్వరలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అమరావతిలో ప్లాన్ చేస్తున్న ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు ఏఏఐ (భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ) ఇప్పటికే ప్రీ ఫీజిబులిటీ స్టడీ పూర్తి చేసి రిపోర్ట్ సిద్ధం చేసిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్ కోసం ఎంపిక చేసిన స్థలం పక్కనే అనంతపురం-గుంటూరు నేషనల్ హైవే (ఎన్‌హెచ్‌544డి) వెళ్లి కోల్‌కతా-చెన్నై హైవేలో కలుస్తుంది. ఈ విమానాశ్రయాన్ని బోయింగ్ విమానాలు ల్యాండ్ అయ్యేలా డిజైన్ చేస్తున్నారు. ఈ ఎయిర్‌పోర్ట్ తొలి దశలో రూ.3,409 కోట్లు పెట్టుబడి అవుతుందని అంచనా వేస్తున్నారు. మొత్తం ఐదు దశల్లో విస్తరించేలా ప్లాన్ చేస్తున్నారు. 2028-2030 నాటికి ఎయిర్‌పోర్ట్ పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ మేరకు ఎయిర్‌పోర్ట్ తొలిదశ ప్రాజెక్టును 2,648 ఎకరాల్లో ప్లాన్ చేశారు. అలాగే 4 వేల మీటర్ల పొడవు, 60 మీటర్ల వెడల్పుతో ఒక రన్‌వే నిర్మాణం చేపట్టనున్నారు.

అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను మాత్రమే కాకుండా.. విమానాలకు సంబంధించి మెయింటెనెన్స్, రిపేర్స్, ఎంఆర్‌వో (ఓవర్‌హాల్‌) వంటివి కూడా ప్లాన్ చేస్తున్నారు. హోటల్స్, కమర్షియల్ కాంప్లెక్స్‌లు కూడా డిజైన్ చేస్తున్నారు. మొత్తం 4,618 ఎకరాలలో విమానాశ్రయం, సంబంధిత సదుపాయాలను 3,823 ఎకరాల్లో, 795 ఎకరాల్ని వాణిజ్య అవసరాల కోసం కేటాయిస్తారు. మరో 200 ఎకరాలు అప్రోచ్‌ రోడ్డు కోసం అవసరమని భావిస్తున్నారు.

 

  Last Updated: 15 May 2026, 11:27 AM IST