ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్రాన్స్‌జెండర్లకు మరో తీపి కబురు చెప్పింది. అమరావతిలో జరిగిన ట్రాన్స్‌జెండర్స్ వెల్ఫేర్ బోర్డు సమావేశంలో మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి కీలక ప్రకటన చేశారు. త్వరలోనే ట్రాన్స్‌జెండర్లకు గుర్తింపు కార్డులు, సింగిల్ రేషన్ కార్డులు అందజేస్తామన్నారు. వారికి సంక్షేమం, నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధి వంటి అంశాలపై సమావేశంలో చర్చించామన్నారు. ట్రాన్స్‌జెండర్లు సమాజంలో ఆత్మగౌరవంతో జీవించేలా సంక్షేమ పథకాలను అందజేస్తామన్నారు. ఆస్పత్రుల్లో ట్రాన్స్‌జెండర్స్‌కి ప్రత్యేకంగా ఓపీ సదుపాయం కల్పిస్తామని, ట్రాన్స్‌జెండర్స్ కోసం బహిరంగ ప్రదేశాలు, ఆస్పత్రుల్లో ప్రత్యేక టాయిలెట్లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని మంత్రి స్వామి ప్రకటించారు.
ట్రాన్స్‌జెండర్స్‌కి స్వయం ఉపాధి కల్పించేందుకు సెర్ప్, మెప్మా సహకారం తీసుకుంటామని మంత్రి స్వామి అన్నారు. నిరాశ్రయులైన వారికి గరీమా గృహం ఏర్పాటు చేసి ఆసరా కల్పిస్తున్నామని, ట్రాన్స్‌జెండర్స్‌లో 676 మందికి ఇప్పటికే ఇళ్లు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. ట్రాన్స్‌జెండర్ల రక్షణ కోసం సీఐడీ సెంట్రల్ ఆఫీసులో స్వాభిమాన్ పేరుతో ప్రత్యేక ప్రొటెక్షన్ సెల్, హెల్ప్‌లైన్ (1091) ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రభుత్వ సేవలను మనమిత్ర వాట్సాప్ యాప్, స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల ద్వారా వినియోగించుకోవాలని సూచించారు. కూటమి ప్రభుత్వం ట్రాన్స్‌జెండర్స్ సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి ఉందని మంత్రి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్రాన్స్‌జెండర్ల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం ట్రాన్స్‌జెండర్ల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసింది. ట్రాన్స్‌జెండర్ హక్కుల పరిరక్షణ చట్టం-2019 ప్రకారం ఈ బోర్డును ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్‌ను రాయలసీమ ప్రాంతానికి, ఆంధ్ర రీజియన్‌కు విశాఖపట్నం కలెక్టర్‌ను ప్రతినిధులుగా నియమించారు. ట్రాన్స్‌జెండర్ల సంక్షేమ బోర్డులో నామినేటెడ్ సభ్యులుగా కోట ప్రేమ్ సాగర్ రాయ్, నక్కా జీవన్ కుమారి, బోను దుర్గలను నియమించారు. వీరు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పదవిలో కొనసాగుతారు. ఈ బోర్డు ద్వారా ట్రాన్స్‌జెండర్లకు విద్య, ఉపాధి, ఆరోగ్యం, సామాజిక భద్రత వంటి అంశాల్లో సహకారం అందించనుంది. సమాజంలో ట్రాన్స్‌జెండర్లకు సమాన హక్కులు, గౌరవం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అంటున్నారు.
