ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది ఉపాధి హామీ కూలీలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద భారీగా నిధులను విడుదల చేస్తూ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలకు ఆర్థిక భరోసా లభించడమే కాకుండా, పెండింగ్ బకాయిల సమస్యకు కూడా పరిష్కారం లభించనుంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడతగా కేంద్ర ప్రభుత్వం ఏపీకి రూ. 1805.24 కోట్లను మంజూరు చేసింది.
ఈ నిధులలో గతేడాది (2025-26) కి సంబంధించిన వేతన బకాయిలు కూడా కలిసి ఉండటం విశేషం. మొత్తం నిధులను కేంద్రం మూడు వర్గాలుగా విభజించింది. ఇందులో ఎస్సీలకు రూ. 361.23 కోట్లు, ఎస్టీలకు రూ. 253.04 కోట్లు, మరియు ఇతర వర్గాలకు రూ. 1190.96 కోట్లను కేటాయించింది. ఈ నిధుల వినియోగంపై కేంద్రం స్పష్టమైన నిబంధనలు విధించింది; ఆర్థిక సంవత్సరం ముగిసిన ఏడాదిలోపు వినియోగ ధ్రువీకరణ పత్రాలు (UCs) సమర్పించాలని, అలాగే ఈ నిధులపై వచ్చే వడ్డీని తిరిగి కేంద్రానికే జమ చేయాలని స్పష్టం చేసింది.
పథకంలో విప్లవాత్మక మార్పులు
కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని మరింత బలోపేతం చేస్తూ పలు మార్పులు ప్రవేశపెట్టింది. ప్రధానంగా ఈ పథకాన్ని వీబీ జీరామ్‌జీ పేరుతో అమలు చేస్తోంది. కూలీల సామాజిక భద్రత కోసం ఏడాదికి కేవలం రూ. 20 ప్రీమియంతో రూ. 2 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తోంది. అంతేకాకుండా, పని ప్రదేశాల్లో కూలీలకు తాగునీరు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు మరియు పనిముట్లు అందించాలని ఆదేశించింది. కూలీలు తమ సమస్యలను ఫిర్యాదు చేసేందుకు 1800 200 1001 అనే 24 గంటల టోల్ ఫ్రీ నెంబర్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. దరఖాస్తు చేసుకున్న రెండు రోజుల్లోనే పని కల్పించాలనే నిబంధనను కఠినతరం చేస్తూ పేద కుటుంబాలకు అండగా నిలుస్తోంది.
కేంద్ర మంత్రి పెమ్మసాని హర్షం
ఏపీకి భారీగా నిధులు విడుదల కావడంపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌లకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ నిధులు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయని ఆయన పేర్కొన్నారు. సమయానికి వేతనాలు చెల్లించడం వల్ల కూలీల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, అర్హులైన ప్రతి కుటుంబానికి ఉపాధి కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు.
