ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డ్వాక్రా (SHG) మహిళా సంఘాలకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా, చిన్న తరహా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి భారీగా రుణ సాయం పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల ద్వారా ఆర్థికంగా ఎదగాలని చూస్తున్న మహిళల కోసం ప్రభుత్వం స్త్రీనిధి (Stree Nidhi) రుణాల పరిమితిని భారీగా పెంచింది. ఇప్పటివరకు లభిస్తున్న రూ. 1 లక్ష రుణానికి అదనంగా, ఇప్పుడు మరో రూ. 2 లక్షల వరకు అదనపు రుణాన్ని మంజూరు చేయాలని నిర్ణయించింది. అంటే సాధారణ మహిళా సంఘాల సభ్యులు తమ వ్యాపార అవసరాల కోసం మొత్తం రూ. 3 లక్షల వరకు పొందే అవకాశం ఉంది. ఇక సామాజికంగా వెనుకబడిన SC, ST వర్గాలకు చెందిన మహిళలకు ఏకంగా రూ. 4 లక్షల వరకు రుణ సాయం అందనుంది. ఈ నిర్ణయం గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో చిన్న తరహా పరిశ్రమలు, కుటీర వ్యాపారాలు చేసుకునే మహిళలకు పెద్ద వరంగా మారనుంది.
సక్రమంగా చెల్లించేవారికే ప్రాధాన్యత
ఈ అదనపు రుణ సదుపాయం అందరికీ కాకుండా, కేవలం క్రమశిక్షణతో కూడిన సభ్యులకు మాత్రమే వర్తిస్తుంది. గతంలో తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తూ (Repayment Track Record), ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్న మహిళలకు మాత్రమే ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ ఎంపిక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు సెర్ఫ్ (SERP) అధికారులు రంగంలోకి దిగుతున్నారు. ప్రతి గ్రామ సంఘం నుంచి సుమారు 15 మంది సభ్యులను చొప్పున ఎంపిక చేసి, వారికి ఈ ఆర్థిక వెసులుబాటును కల్పించనున్నారు. సభ్యుల గత రికార్డులను పరిశీలించిన తర్వాతే ఈ భారీ రుణాలకు ఆమోదం తెలపనున్నారు.
నెల రోజుల పాటు అవగాహన సదస్సులు
ఈ కొత్త పథకంపై మహిళలకు పూర్తి అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం రేపటి నుంచి నెల రోజుల పాటు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించనుంది. సెర్ఫ్ అధికారులు గ్రామ గ్రామాన పర్యటించి, ఈ రుణాలను ఎలా పొందాలి, ఏయే వ్యాపారాలకు వీటిని వినియోగించుకోవచ్చు అనే అంశాలపై మహిళలకు అవగాహన కల్పిస్తారు. ఈ శిక్షణా కాలంలోనే అర్హులైన అభ్యర్థుల ఎంపిక కూడా పూర్తి చేసి, వీలైనంత త్వరగా రుణాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. మహిళలు కేవలం గృహిణులుగా మాత్రమే కాకుండా, వ్యాపారవేత్తలుగా ఎదగాలనే లక్ష్యంతో ఈ భారీ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది.
