High Court Bench : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవతో రాయలసీమ ప్రజల చిరకాల వాంఛ నెరవేరే దిశగా అడుగులు పడుతున్నాయి. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రయత్నాలు వేగవంతం అయ్యాయి. ఏదైనా రాష్ట్రంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు కావాలంటే సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆ రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తప్పనిసరిగా ఉండాలి. అందుకే దీనికి సంబంధించిన ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తుల ఫుల్ కోర్టు ఎదుటకు తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అక్టోబరు 28వ తేదీన హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు ఏపీ న్యాయశాఖ కార్యదర్శి వి.సునీత లేఖ రాశారు. ఇదే అంశాన్ని సీఎం చంద్రబాబు((High Court Bench) ఇప్పటికే కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ దృష్టికి తీసుకెళ్లారని సమాచారం.
Also Read :Rana : మహేష్ రాజమౌళి సినిమా.. హాలీవుడ్ రేంజ్ అంటున్న బాహుబలి స్టార్..!
ఆంధ్రప్రదేశ్ జనాభా 4.95 కోట్లు. అందులో రాయలసీమ జనాభా 1.59 కోట్లు. రాయలసీమ ప్రాంతం నుంచి హైకోర్టుకు రావాలంటే ప్రజానీకానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కర్నూలు నుంచి విజయవాడకు వెళ్లడానికి నేరుగా రైలు లేదు. వైఎస్సార్ జిల్లా నుంచి విజయవాడ ప్రయాణించేందుకు ఒక్క రైలే ఉంది. రాయలసీమలోని కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటైతే .. కోర్టు కేసుల్లో ఉండే వారికి ఎంతో సౌకర్యంగా ఉంటుంది. విలువైన సమయం, ధనం రెండూ ఆదా అవుతాయి. శ్రమ కూడా తగ్గుతుంది. ఇవే అంశాలను ప్రస్తావిస్తూ ఇటీవలే హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు ఏపీ న్యాయశాఖ కార్యదర్శి వి.సునీత లేఖ రాశారు. రాయలసీమ ప్రాంతం నుంచి ఏపీ హైకోర్టుకు వెళ్తున్న కేసుల సంఖ్య, పెండింగ్ కేసుల వివరాలు, కేసులు పరిష్కారమయ్యేందుకు పడుతున్న సగటు కాల వ్యవధి వంటి అంశాలను హైకోర్టు న్యాయమూర్తుల ఫుల్ కోర్టు ఎదుట ఉంచాలని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను కోరారు. దీనికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని ఏపీ ప్రభుత్వానికి కూడా పంపాలన్నారు.
Also Read :Vijay Sethupati Maharaja : అక్కడ 40000 థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న విజయ్ సేతుపతి సూపర్ హిట్ సినిమా..!
న్యాయ విచారణలు సాఫీగా ఎక్కడికక్కడ జరిగేందుకుగానూ ఇప్పటికే దేశంలోని చాలా రాష్ట్రాలలోని వివిధ నగరాల్లో హైకోర్టులకు బెంచ్‌లను ఏర్పాటు చేశారు. మద్రాస్ హైకోర్టుకు మదురై బెంచ్, కలకత్తా హైకోర్టుకు జల్‌పాయ్‌గురి బెంచ్, అలహాబాద్ హైకోర్టుకు లక్నో బెంచ్, మధ్యప్రదేశ్ హైకోర్టుకు గ్వాలియర్ బెంచ్, ఇండోర్ బెంచ్, బాంబే హైకోర్టుకు నాగ్‌పూర్ బెంచ్, ఔరంగాబాద్ బెంచ్, పనాజీ బెంచ్, రాజస్థాన్ హైకోర్టుకు జైపూర్ బెంచ్, గౌహతి హైకోర్టుకు కోహిమ బెంచ్, ఐజోల్ బెంచ్, ఇంఫాల్ బెంచ్, అగర్తల బెంచ్, షిల్లాంగ్ బెంచ్, ఈటానగర్ బెంచ్‌లు ఉన్నాయి. ఈవిధంగానే కర్నూలుకు ఏపీ హైకోర్టు బెంచ్ మంజూరయ్యే అవకాశం ఉంది.