Ambulances : నటుడు, సూద్ ఛారిటీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సోనూ సూద్ ఈరోజు సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సోనూ సూద్ ఏపీ ప్రభుత్వానికి 4 అంబులెన్స్‌లను అందించారు. అంబులెన్స్‌లకు సంబంధించిన తాళాలను సీఎం చేతికి అందజేశారు. అనంతరం ఈ అంబులెన్సులను చంద్రబాబు ప్రారంభించారు. తనను కలిసేందుకు వచ్చిన సోనూసూద్‌ను యోగక్షేమాలను సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య సంరక్షణలో మౌలిక సదుపాయాలను కల్పించడానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని… ఈ ఆశయంలో ‘సూద్ ఛారిటీ ఫౌండేషన్’ భాగస్వామి అయినందుకు కృతజ్ఞతలు అని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నటుడు సోనూ సూద్ కు శాలువా కప్పి సన్మానించారు. అనంతరం ఇరువురు కాసేపు మాట్లాడుకున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన సోనూసూద్.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడూ తన హృదయానికి దగ్గరగా ఉంటారన్న సోనూసూద్.. ఏపీ తనకు రెండో ఇళ్లు లాంటిదన్నారు. తన భార్య కూడా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళేనని గుర్తు చేశారు. ఏపీ ప్రజలు తనను ఎప్పుడూ ఉన్నత స్థానంలో ఉంచుతారన్న సోనూసూద్.. ఏ అవసరం వచ్చినా ఫోన్ కాల్ దూరంలో ఉంటానన్నారు. ఏపీలో వైద్య సౌకర్యాలను అభివృద్ధి చేయటంలో తన వంతు కృషి చేస్తున్నట్లు చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడతాయని అంబులెన్సులు అందించినట్లు తెలిపారు.
ఏపీని అభివృద్ధి చేయటంలో తన భాగస్వామ్యం కూడా ఉండాలని అంబులెన్సులను ఇచ్చానన్నారు. సూద్ ఫౌండేషన్ ప్రతీ సామాన్య వ్యక్తి కోసం పని చేస్తోందని, అవసరమైతే ప్రభుత్వాలతోనూ కలిసి పని చేస్తామన్నారు. అంబులెన్సులు ఎంత అన్నది ముఖ్యం కాదని ప్రజలతో ఉన్న అనుబంధం ముఖ్యమని తెలిపారు. సమాజానికి తిరిగి ఇవ్వాలన్న తపనే తనను ఇలా నడిపిస్తోందని తెలిపారు. కోవిడ్ సమయం నుంచి సీఎం చంద్రబాబుతో తాను టచ్‌లో ఉన్నానని, వారి ఆశీర్వాదం కూడా ఇప్పుడు తీసుకున్నానన్నారు.
Read Also: SwaRail vs IRCTC : ‘స్వరైల్’, ‘ఐఆర్‌సీటీసీ’ యాప్‌లలో ఏది బెటర్ ?