Mithun Reddy : వైఎస్సార్ సీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన లిక్కర్ స్కాంపై ప్రత్యేక దర్యాప్తు టీమ్ (సిట్) విచారణ వేగంగా జరుగుతోంది. ఈ స్కాంలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి పాత్రకు సంబంధించిన కీలక సమాచారాన్ని సిట్ అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది. ఓ వైపు ముడుపుల వసూళ్లు.. మరోవైపు సొంత బ్రాండ్ల మద్యానికి ఎక్కువగా ఆర్డర్లు ఇచ్చుకోవటం ద్వారా మిథున్‌రెడ్డి రెండు విధాలుగా అనుచిత లబ్ధి పొందారని సిట్ గుర్తించింది. లిక్కర్ డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి ముడుపుల వసూళ్ల కోసం రాజ్ కెసిరెడ్డితో కలిసి హవాలా నెట్‌వర్క్‌ను తయారు చేయడంలో, వసూలు చేసిన ముడుపుల్ని ఆనాటి ప్రభుత్వ పెద్దలకు చేర్చటంలో మిథున్‌రెడ్డి కీలక పాత్ర పోషించారని సిట్ తేల్చింది. అందుకే ఈ స్కాంలో మిథున్ రెడ్డిని ఏ4గా చేర్చింది. ఈ వ్యవహారంలో ఇప్పటిదాకా అరెస్టయిన నిందితుల రిమాండు రిపోర్టుల్లో, మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేయాలంటూ సుప్రీంకోర్టులో వేసిన అఫిడవిట్‌లోనూ ఈ అంశాలను సిట్ ప్రస్తావించింది.
Also Read :Pakistan Vs IndiGo : ‘ఇండిగో’పై పాక్ నిర్దయ.. 227 మంది ప్రాణాలతో చెలగాటం.. ఏమైందంటే ?
మిథున్‌రెడ్డిపై సిట్ అభియోగాలివీ..
- ఐఆర్‌టీఎస్ అధికారి వాసుదేవరెడ్డిని డిప్యుటేషన్‌పై తీసుకొచ్చి ఏపీఎస్‌బీసీఎల్ ఎండీగా, డిస్టిలరీస్, బ్రూవరీస్ కమిషనర్‌గా నియమించడంలో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారని సిట్ గుర్తించింది.
- ఎక్సైజ్ శాఖలో అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేసే డి.సత్యప్రసాద్‌ను తిరుపతిలోని తన నివాసానికి మిథున్‌రెడ్డి పిలిపించుకొని.. తాము చెప్పినట్లుగా చేస్తే కన్ఫర్డ్ ఐఏఎస్‌గా పదోన్నతి ఇప్పిస్తానని ప్రలోభపెట్టారు.
- వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్‌లను 2019 అక్టోబరు 13న హైదరాబాద్‌లోని విజయసాయిరెడ్డి నివాసానికి మిథున్ రెడ్డి పిలిపించుకున్నారు. అంతకుముందు సంవత్సరాల్లో ఏపీలో జరిగిన మద్యం విక్రయాల వివరాలపై చర్చించారు. ఈ మీటింగ్‌లో మిథున్‌రెడ్డి, రాజ్ కసిరెడ్డి, ఆయన తోడల్లుడు ముప్పిడి అవినాష్‌రెడ్డి, విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. లిక్కర్ ముడుపుల ద్వారా నెలకు రూ.60 కోట్ల దాకా పొందొచ్చని ఈ సమావేశంలో మిథున్‌రెడ్డి, కసిరెడ్డి నిర్ణయించారు.
- బ్రాండ్ల మూల ధర ఆధారంగా.. ఒక్కో లిక్కర్ కేసుకు రూ.150 నుంచి రూ.600 దాకా ముడుపులు వసూలు చేయొచ్చని డిసైడ్ చేసుకున్నారు.
- మిథున్‌రెడ్డి(Mithun Reddy) ఆదేశాల మేరకు 2019 డిసెంబరులో వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్‌లు రాజ్ కసిరెడ్డిని కలిశారు. తాము చెప్పిన కంపెనీలకే సరఫరా ఆర్డర్లు ఇవ్వాలని రాజ్ నిర్దేశించారు.
- మిథున్‌రెడ్డి ఎస్పీవై డిస్టిలరీస్ సహా మరికొన్నింటిలో తన సొంత బ్రాండ్ల మద్యాన్ని తయారు చేయించి ఏపీఎస్‌బీసీఎల్‌తో కొనుగోలు చేయించారు. వాటికి మూల ధరలు విపరీతంగా పెంచుకుని లాభపడ్డారు.
- ముడుపులిచ్చే మద్యం కంపెనీల బ్రాండ్లకే ఎక్కువగా ఆర్డర్లు దక్కేలా ఇండెంట్లు పెట్టించేవారు. ఈ ఆర్డర్లు పొందే డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి రాజ్ కసిరెడ్డి బృందం ఐదురోజులకోసారి ముడుపులు వసూలు చేసేది.
- ముడుపులు వసూలవుతున్నాయా అనేది పర్యవేక్షించేందుకు మిథున్‌రెడ్డి తరచూ సమావేశాలు నిర్వహించేవారు.
- రాజ్ కసిరెడ్డి తాను వసూలు చేసిన ముడుపులను మిథున్‌రెడ్డితో పాటు నాటి ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితులైన మరికొందరికి ఇచ్చేవారు. వారంతా దాన్ని పెద్దలకు చేరవేసేవారు.
- ఈ ముడుపుల్లో ఎక్కువ భాగం బంగారం, నగదు రూపంలోనే ఉండేది.