YS Sharmila : నెల్లూరు జిల్లా కరేడు గ్రామంలో ఇండోసోల్ కంపెనీకి సోలార్ ప్లాంట్ నిర్మాణం కోసం చేపట్టిన భూసేకరణపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మూడు పంటలు పండే పచ్చని పొలాలను పరిశ్రమల కోసం ధ్వంసం చేయడం దారుణమని ఆమె అభిప్రాయపడ్డారు. భూముల కోసం రైతులను గెంటిపెట్టే విధంగా ప్రవర్తించడం న్యాయసమ్మతమా? అని ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కరేడు రైతులది సాధారణ పోరాటం కాదు… బతుకుదెరువు కోసం వారు గళమెత్తుతున్నారు. వారి ఉద్యమాన్ని అణచివేయడం సిగ్గుచేటు. పచ్చటి పొలాల మధ్య పరిశ్రమల పేరుతో భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేయడమంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అని షర్మిల విమర్శించారు.
Read Also: Congress : అధికారంలో ఉన్నప్పుడు కవిత.. బీసీల గురించి మాట్లాడారా?: మహేశ్ కుమార్‌గౌడ్
గత వైసీపీ హయాంలో షిరిడీ సాయి అనుబంధ సంస్థకు అనుమతులు ఇచ్చినట్లు గుర్తు చేస్తూ, ఇప్పుడు కూటమి ప్రభుత్వం మరింత దారుణంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. గ్రామ సభలు నిర్వహించకుండా, ప్రజల అభిప్రాయాన్ని పట్టించుకోకుండా, ఏకంగా ఊరినే ఖాళీ చేయించేలా భూములు కేటాయించడం ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి నిదర్శనమని ఆమె వ్యాఖ్యానించారు. ఇండోసోల్ కంపెనీకి 8,458 ఎకరాల భూమి కేటాయించాలన్న ప్రభుత్వ ఆలోచనను షర్మిల “జనాభావానికి వ్యతిరేకంగా తీసుకున్న నేర నిర్ణయం గా అభివర్ణించారు. రైతుల భూములను బలవంతంగా తీసుకోవడం అంటే వారి జీవనాధారాన్ని నాశనం చేయడమే. ఇది కేవలం భూసేకరణ కాదే, జీవనాంతకమైన దాడి అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరేడు గ్రామ ప్రజలు చేస్తున్న శాంతియుత పోరాటాన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందని, భూముల రక్షణ కోసం అవసరమైతే ఉద్ధృతమైన ఉద్యమానికి వెనుకాడబోమని స్పష్టం చేశారు. రైతుల శవాల మీద పరిశ్రమలు కట్టాలని చూస్తే సహించేది లేదు. అభివృద్ధి పేరుతో జరిగే ఈ అక్రమ చర్యలపై కాంగ్రెస్ గళమెత్తుతుంది అని హామీ ఇచ్చారు. సమాధానమిచ్చే బాధ్యత ప్రభుత్వానిదేనని హెచ్చరిస్తూ, వెంటనే భూసేకరణ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. “కరేడు ప్రజల అభిప్రాయాన్ని తీసుకోకుండా తీసుకున్న ఏ నిర్ణయమూ చెల్లదు. గ్రామ సభలు నిర్వహించి రైతుల డిమాండ్లను ఆమోదించాలి. పరిశ్రమల అభివృద్ధికి కాంగ్రెస్ వ్యతిరేకం కాదు, కానీ రైతుల జీవితాలతో చెలగాటం ఆమోదించబోదు అని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు.
Read Also: Dalai Lama : వారసుడిని నిర్ణయించే హక్కు దలైలామాకే ఉంది : భారత్