Record In AP History: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే (Record In AP History) సరికొత్త రికార్డు సృష్టిస్తూ 11వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశంలో ఏకంగా రూ. 1.14 లక్షల కోట్ల భారీ పెట్టుబడులకు ఆమోదం లభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మొత్తం 30కి పైగా ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపారు. ఈ పెట్టుబడులలో ఐటీ, ఇంధనం, టూరిజం, ఏరోస్పేస్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి కీలక రంగాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో దాదాపు 67 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా.
దేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ పెట్టుబడికి ఆమోదం
ఈ 11వ SIPB సమావేశం దేశ ఆర్థిక చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (FDI) విభాగంలో ఇప్పటివరకు ఎన్నడూ లేని విధంగా రూ. 87,520 కోట్లు పెట్టుబడి పెట్టనున్న RAIDEN INFO TECH DATA CENTER ఏర్పాటుకు ఆమోదం లభించింది. ఇంత భారీ స్థాయిలో ఫారిన్ ఇన్వెస్టిమెంట్ సాధించడం రాష్ట్ర చరిత్రలో ఒక కొత్త చరిత్రను లిఖిస్తుందని ప్రభుత్వ వర్గాలు, SIPB సమావేశం అభిప్రాయపడ్డాయి.
Also Read: Yuzvendra Chahal: రెండు నెలల్లో మోసం చేస్తే నాలుగున్నరేళ్లు ఎలా నిలబడుతుంది?: చాహల్
ఈ చారిత్రక విజయం సాధించినందుకు ముఖ్యమంత్రి సహా మంత్రులందరూ ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్‌ను అభినందించారు. గత 15 నెలల కాలంలో పెట్టుబడుల కోసం చేసిన ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా సంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రాజెక్టుల వేగవంతానికి ప్రత్యేక అధికారులు
దాదాపు మూడు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో ప్రాజెక్టుల వారీగా లోతైన చర్చ జరిగింది. ఆమోదం పొందిన భారీ ప్రాజెక్టుల పనులు త్వరగా ప్రారంభం కావడానికి ప్రత్యేక అధికారులను నియమించడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రత్యేక అధికారులు కంపెనీలకు అండగా ఉండి, ప్రాజెక్టుల సత్వర నిర్మాణానికి బాధ్యత వహిస్తారు. ఇప్పటివరకు జరిగిన మొత్తం 11 SIPB సమావేశాల ద్వారా రాష్ట్రంలో రూ. 7.07 లక్షల కోట్ల భారీ పెట్టుబడులకు ఆమోదం లభించడం విశేషం. ఈ పెట్టుబడులు రాష్ట్రాభివృద్ధికి, యువత భవిష్యత్తుకు ఊతం ఇవ్వనున్నాయి.
