AP liquor scam case : ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన మద్యం కుంభకోణం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టయిన రాజ్ కెసిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. దీంతో ఆయనకు చట్టపరంగా పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది. అలాగే, రాజ్ కెసిరెడ్డి తండ్రి ఉపేంద్రరెడ్డి దాఖలు చేసిన మరో పిటిషన్‌ను కూడా కోర్టు తిరస్కరించింది. రాజ్ కెసిరెడ్డి ప్రస్తుతం కస్టడీలో ఉన్న నేపథ్యంలో బెయిల్ కోసం సంబంధిత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆయనకు తక్షణంగా సుప్రీం కోర్టు నుంచి ఎలాంటి ఉపశమనం లభించలేదు.
Read Also: Kavitha Letter : కవిత లేఖ పై హరీష్ రావు ఏమన్నాడంటే..!!
ఈ రెండు పిటిషన్లను జస్టిస్ పీఎస్ నరసింహా మరియు జస్టిస్ జెబి పార్థివాలా నేతృత్వంలోని ధర్మాసనం పరిశీలించింది. వాదనలు విన్న అనంతరం ఈ నెల 19న తీర్పును రిజర్వ్ చేసిన ధర్మాసనం, శుక్రవారం నాడు తుది తీర్పును వెలువరించింది. ఉపేంద్రరెడ్డి తన కుమారుడు అరెస్టయ్యే సమయంలో సంబంధిత నిబంధనలు పాటించలేదని ఆరోపిస్తూ పిటిషన్ వేశారు. ఆయన వాదన ప్రకారం, రాజ్ అరెస్టు సమయంలో ఆయన్ను ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా, అలాగే స్థానిక పోలీసులకు తెలియజేయకుండా అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు.
ఇక, రాజ్ కెసిరెడ్డి తరఫు పిటిషన్‌లో, తాను తాము నివసిస్తున్న రాష్ట్రం బయట ఉన్నప్పటికీ, ఏపీ సీఐడీ అధికారులే వచ్చి అరెస్టు చేయడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. పక్కరాష్ట్రాల్లో అరెస్టులు చేయాలంటే స్థానిక పోలీసుల అనుమతి అవసరమని రాజ్ తరఫు న్యాయవాది వాదించారు. అయితే, ఈ వాదనలను సుప్రీం కోర్టు ధర్మాసనం తిరస్కరించింది. రాజ్ కెసిరెడ్డి పై ఉన్న అభియోగాలు తీవ్రతరమైనవిగా పరిగణిస్తూ, బెయిల్ మంజూరుపై ఆలోచించాలంటే తగిన కోర్టును ఆశ్రయించాలని సూచించింది. ఈ తీర్పుతో కేసు మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ కుంభకోణంలో ఇప్పటికే పలువురు ప్రముఖులు ఆరోపణల బారిన పడగా, రాజ్ కెసిరెడ్డి అరెస్ట్ కీలక దశగా భావిస్తున్నారు. అయితే, ఆయన తండ్రి ఉపేంద్రరెడ్డి ప్రయత్నాలు సైతం ఫలితం ఇవ్వకపోవడం ముద్దయినట్లయింది. ఈ కేసు నేపథ్యంలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశాలు ఉన్నాయని వర్గాలు చెబుతున్నాయి.