Prakash Raj: రావణ్ మళ్ళీ మళ్ళీ అరెస్ట్ పై ప్రకాష్ రాజ్ ఫైర్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాంశాలపై సోషల్ మీడియాలో విమర్శలు చేసే యూట్యూబర్ ‘ప్రశ్న’ రావణ్ అలియాస్ జోసెఫ్ అరెస్టుల పర్వం ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీసింది. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో పోలీసులు ఆయన్ని వరుసగా అరెస్ట్ చేస్తుండటంపై నటుడు ప్రకాష్ రాజ్ శనివారం మరోసారి అత్యంత ఘాటుగా స్పందించారు. ఒక కేసులో న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసిన వెంటనే, మరో పాత కేసును తెరపైకి తెచ్చి పోలీసులు వ్యవహరిస్తున్న తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. […]

Published By: HashtagU Telugu Desk
Prakash Raj lashes out over repeated arrests of 'Ravan'.

Prakash Raj lashes out over repeated arrests of 'Ravan'.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాంశాలపై సోషల్ మీడియాలో విమర్శలు చేసే యూట్యూబర్ ‘ప్రశ్న’ రావణ్ అలియాస్ జోసెఫ్ అరెస్టుల పర్వం ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీసింది. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో పోలీసులు ఆయన్ని వరుసగా అరెస్ట్ చేస్తుండటంపై నటుడు ప్రకాష్ రాజ్ శనివారం మరోసారి అత్యంత ఘాటుగా స్పందించారు. ఒక కేసులో న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసిన వెంటనే, మరో పాత కేసును తెరపైకి తెచ్చి పోలీసులు వ్యవహరిస్తున్న తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ కక్షసాధింపు చర్యేనని సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు.

శనివారం విడుదల చేసిన వీడియో సందేశంలో ప్రకాష్ రాజ్ ఏపీ కూటమి ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. “ప్రశ్న రావణ్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పక్కా కక్షసాధింపు ధోరణిని అవలంబిస్తోంది. పోలీసులు చట్టాన్ని పక్కనపెట్టి ప్రవర్తిస్తున్నారు. ఒక కేసులో కోర్టు బెయిల్ ఇస్తుంటే, దాన్ని గౌరవించకుండా వెంటనే మరో పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్త కేసులు నమోదు చేసి వేధింపులకు గురిచేస్తున్నారు. న్యాయస్థానాలు ఏం చెబుతున్నాయో అర్థం చేసుకునే విచక్షణ కూడా లోపించింది. దాదాపు 30 కేసులు సిద్ధం చేసుకుని అరెస్టుల నాటకం ఆడుతున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ వద్ద జోసెఫ్‌పై భౌతిక దాడులు చేసేందుకు జనసైనికులు ప్రయత్నిస్తుండటం దారుణం. గత నాలుగు రోజులుగా రావణ్ పోలీస్ కస్టడీలోనే ఉన్నాడు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మరియు ఏపీ పోలీస్ యంత్రాంగం నడుపుతున్న ఈ అప్రజాస్వామిక తీరును దేశమంతా గమనిస్తోంది. ప్రశ్నించే గొంతుకలను నొక్కేయడం పిరికితనం. ఇది చాలా తప్పు, తప్పు, తప్పు” అని దుయ్యబట్టారు.

అంతకుముందు పోస్టులో… అర్థరాత్రి వేళ హైదరాబాద్‌లో జోసెఫ్‌ను అదుపులోకి తీసుకుని ఏపీకి తరలించడాన్ని ఆయన ఆక్షేపించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరోక్షంగా ఉద్దేశిస్తూ.. “పోలీస్ శాఖలో ఎంతో నిజాయితీగా సేవలందించిన మీ తండ్రిగారిపై ఉన్న గౌరవంతోనైనా ఇలాంటి పనులు ఆపండి. చేతికి అధికారం వచ్చింది కదా అని వ్యక్తిగత ప్రతీకారాల కోసం పోలీసు వ్యవస్థను వాడుకోవడం ఏమాత్రం సమర్థనీయం కాదు” అంటూ ప్రకాష్ రాజ్ అత్యంత తీవ్రమైన పదజాలంతో ట్వీట్ చేశారు.

ఇదిలా ఉండగా, ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవుల సభలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో జూన్ 29న పిఠాపురం పోలీస్ స్టేషన్‌లో జనసేన నేత బొజ్జ కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో రావణ్‌పై బీఎన్ఎస్ యాక్ట్ మరియు ఐటీ చట్టం కింద కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే ఆయనకు పిఠాపురంలో బెయిల్ రాగానే సర్పవరం పోలీసులు, అక్కడ బెయిల్ రాగానే కృష్ణా జిల్లా మచిలీపట్నం పోలీసులు వరుసగా అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం రాత్రి మచిలీపట్నం మొబైల్ కోర్టు జడ్జి ఎదుట హాజరపర్చగా, న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ బలమైన వాదనలు వినిపించి జోసెఫ్‌కు బెయిల్ సాధించారు. అయితే, కోర్టు నుంచి బయటకు రాగానే అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పోలీసులు మరో కేసులో ఆయనను నాలుగోసారి అదుపులోకి తీసుకుని తరలించడం సంచలనంగా మారింది. జోసెఫ్ అరెస్టుల నేపథ్యంలో పోలీస్ స్టేషన్ల వద్ద జనసేన శ్రేణులు భారీగా మోహరించడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

 

  Last Updated: 04 Jul 2026, 03:53 PM IST