బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ, విపత్తుల నిర్వహణ శాఖ అంచనా వేస్తున్నాయి. బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం రాబోయే రెండు, మూడు రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ అల్పపీడనం ప్రభావంతో ఇవాళ అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు, మిగతా చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
మరోవైపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, పల్నాడు జిల్లాల్లో కొన్ని చోట్ల మేఘావృతమైన వాతావరణంతో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి వానలు పడే అవకాశం ఉంది. తీరం వెంట ఈదురు గాలులు గంటకు 40-50 కిమీ వేగంతో వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.
ఇటు తెలంగాణలో మూడు రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు. ప్రధానంగా దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో తేలిక నుంచి మోస్తరు వానలు పడతాయని అంచనా వేస్తున్నారు.
విపత్తు నిర్వహణలో యువతకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లాకు చెందిన 100 మంది నేషనల్ సర్వీస్ స్కీమ్ (NSS) వాలంటీర్లకు ‘యువ ఆపదమిత్ర’లుగా విజయవంతంగా శిక్షణ ఇచ్చారు. ఫైర్ సేఫ్టీ (అగ్ని ప్రమాదాల నివారణ), విపత్తుల ముందస్తు జాగ్రత్తలు, అత్యవసర పరిస్థితుల్లో స్పందించే విధానాలపై అవగాహన కల్పించారు. ఈ శిక్షణ ద్వారా వాలంటీర్లలో విపత్తు నిర్వహణ సంసిద్ధత, అత్యవసర సమయాల్లో వేగంగా స్పందించే ప్రాక్టికల్ నైపుణ్యాలు గణనీయంగా పెరిగాయి. విపత్తుల సమయంలో తమ ప్రాంత ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలు అందించేందుకు ఈ శిక్షణ ఈ యువ ఆపదమిత్రులకు ఎంతో ఉపయోగపడుతుందని అంటున్నారు.
