ఏపీ అసెంబ్లీలో అమరావతి రాజధాని చట్టబద్ధత తీర్మానం సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చ గా మారాయి. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే చారిత్రాత్మక తీర్మానాన్ని ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. సుమారు ఐదున్నర గంటల పాటు సాగిన సుదీర్ఘ చర్చ అనంతరం, ఈ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపాలని నిర్ణయించారు. అయితే, ఈ చర్చా సందర్భంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ ప్రసంగంలో దొర్లిన కొన్ని వ్యాఖ్యలను పవన్ కళ్యాణ్ సున్నితంగానే అయినా చాలా బలంగా తప్పు పట్టారు. మనలో మనకు ప్రాంతీయ విభేదాలు ఉంటే రాష్ట్రాన్ని రక్షించుకోవడం సాధ్యం కాదని ఆయన హెచ్చరించడం చర్చనీయాంశమైంది.
సబ్ డివిజన్ల ధోరణి వీడాలి -లోకేష్ వ్యాఖ్యలపై అభ్యంతరం
అసెంబ్లీలో నారా లోకేష్ మాట్లాడుతూ.. ‘మీ ఉత్తరాంధ్రకు అవసరం లేదా?’ అని ప్రశ్నించిన తీరుపై పవన్ కళ్యాణ్ స్పందించారు. “మనం ఇంకా ఉత్తరాంధ్ర, రాయలసీమ, గోదావరి జిల్లాలు అని విడిపోకూడదు.. అందరం మాట్లాడేది తెలుగే, అందరిదీ ఒకటే నేల” అని పవన్ గుర్తు చేశారు. 1953 నుంచి నేటి వరకు ఆంధ్రులు తమ ఉనికి కోసం, ఆస్తుల కోసం పోరాడుతూనే ఉన్నారని, ఇంకా మనం అంతర్గత విభజనల గురించి మాట్లాడుకుంటే మన బలహీనతే ఇతరుల గెలుపు అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయ నాయకులు, మేధావులు అంతా ‘ఒకే రాష్ట్రం-ఒకే జాతి’ అనే భావనతో ఉండాలని, అప్పుడే కేంద్రం వద్ద మన గొంతు బలంగా వినిపిస్తుందని పవన్ కళ్యాణ్ హితబోధ చేశారు.
రాజకీయ స్థిరత్వమే ప్రగతికి సోపానం – కాంగ్రెస్ తీరుపై విమర్శలు
రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని పవన్ కళ్యాణ్ విమర్శించారు. విభజన జరిగిన ఇన్నేళ్ల తర్వాత కూడా సరైన హైకోర్టు, రాజధాని లేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు టెంట్ వేసుకొనైనా పని చేద్దామని భావించిన విషయాన్ని గుర్తు చేస్తూ.. అభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వం అత్యవసరమని పేర్కొన్నారు. అమరావతి విషయంలో జనసేన పార్టీ మొదటి నుంచి ఒకే మాట మీద ఉందని, రాజధాని నిర్మాణానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. కేవలం ప్రాంతీయ ప్రయోజనాల కంటే రాష్ట్ర సమగ్ర అభివృద్ధి ముఖ్యమని ఆయన తన ప్రసంగంలో నొక్కి చెప్పారు.
