ఆన్‌లైన్ క్రయవిక్రయాల వేదిక ‘ఓఎల్ఎక్స్’ (OLX) ద్వారా అమాయకులను బురిడీ కొట్టిస్తూ, మూడు రాష్ట్రాల పోలీసులకు సవాల్‌గా మారిన ఘరానా మోసగాడు అజిత్ కుమార్ ఎట్టకేలకు చిక్కాడు.
ఏలూరు జిల్లా నాగన్నగూడేనికి చెందిన భీమడ అజిత్ కుమార్, కష్టపడకుండా సులభంగా డబ్బు సంపాదించి విలాసవంతమైన జీవితం గడపాలని ఓఎల్ఎక్స్‌ను తన మోసాలకు అడ్డాగా మార్చుకున్నాడు. ఇతని మోసం చాలా విభిన్నంగా ఉండేది. ఓఎల్ఎక్స్‌లో కారు అమ్మకానికి పెట్టిన యజమానులకు ఫోన్ చేసి, తాను డీలర్‌నని నమ్మించి అడ్వాన్స్ ఇస్తానని చెప్పేవాడు. అదే సమయంలో తక్కువ ధరకే కారు ఇప్పిస్తానని కొనుగోలుదారులను ఆకర్షించేవాడు. ఇలా అటు యజమానిని, ఇటు కొనుగోలుదారుని తన మాయమాటలతో బుట్టలో వేసుకుని, మధ్యలో తాను ఉండి భారీ స్కామ్‌కు తెరలేపేవాడు.
అజిత్ పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు అత్యంత తెలివిగా వ్యవహరించేవాడు. కొనుగోలుదారులు డబ్బులు పంపే సమయంలో తన సొంత బ్యాంక్ ఖాతా వివరాలు ఇచ్చేవాడు కాదు. బదులుగా, ఏదైనా బంగారు షాపు యజమాని ఖాతా నంబర్ ఇచ్చి అందులోకి నగదు బదిలీ చేయించేవాడు. ఆ డబ్బుతో వెంటనే బంగారం కొనుగోలు చేసి అక్కడి నుంచి జారుకునేవాడు. నగదు అందిన వెంటనే తన ఫోన్ నంబర్‌ను స్విచ్ఛాఫ్ చేసి అదృశ్యమయ్యేవాడు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు తమిళనాడు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 32 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఒక్క తెలంగాణలోనే 12 కేసులు ఉండటం ఇతని నెట్‌వర్క్ ఎంతటిదో తెలియజేస్తోంది.
విజయవాడ సైబర్ క్రైమ్ డీఎస్పీ కృష్ణప్రసన్న నేతృత్వంలోని బృందం సాంకేతిక ఆధారాలతో అజిత్‌ను వెంబడించి ఎట్టకేలకు పట్టుకుంది. నిందితుడు ఇప్పటివరకు ప్రజల నుండి సుమారు రూ. 94 లక్షలు కొల్లగొట్టినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి వద్ద నుండి రూ. 37 లక్షల నగదు, 49 గ్రాముల బంగారం మరియు రూ. 50 లక్షల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో వస్తువులను కొనేటప్పుడు ముఖాముఖి కలిసి, వస్తువును పరిశీలించిన తర్వాతే నగదు చెల్లించాలని, అపరిచితులకు ముందే డబ్బు పంపవద్దని పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.
