Nellore Postmortem : చంద్ర‌బాబు స‌భపై పోస్ట్ మార్టం! తొక్కిసలాటపై రాజ‌కీయం!!

నెల్లూరు జిల్లా కందుకూరు స‌భకు(Nellore Postmortem) అనూహ్యంగా జ‌న సందోహం క‌దిలింది.

  • Written By:
  • Updated On - December 29, 2022 / 01:07 PM IST

`తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు (Nellore Postmortem) మ‌న‌స్తాపం చెందారు. క‌న్నీళ్లు పెట్టుకున్నారు. దుఃఖాన్ని పంటిబిగువున పెట్టుకుని జెండా మోసిన‌ సైనికుల పాడే మోసారు. మృతి చెందిన కార్య‌క‌ర్త‌ల కుటుంబీకుల్ని ఓదార్చారు. అమెరికా సైన్యం కంటే ఎక్కువ‌గా ఉన్న తెలుగుదేశం స‌భ్యుల‌కు ధైర్యం చెప్పే ప్ర‌య‌త్నం చేశారు.`నెల్లూరు జిల్లా కందుకూరు స‌భకు (Nellore Postmortem) అనూహ్యంగా జ‌న సందోహం క‌దిలింది. అక్క‌డి రోడ్లు విశాలంగా లేక‌పోవ‌డం, అంచ‌నాకు మించిన జ‌నం రావడాన్ని చంద్ర‌బాబు(CBN) గ‌మ‌నించారు. ప్ర‌మాదం జ‌ర‌గ‌డానికి ముందుగా కార్య‌క‌ర్త‌ల‌ను అప్ర‌మ‌త్తం చేయడానికి `బంగారు త‌మ్ముళ్లూ` అంటూ బ్ర‌తిమ‌లాడుకున్నారు. కానీ, వాళ్ల ఉత్సాహాన్ని ఆయ‌న లాలింపు ఆప‌లేక‌పోయింది. రెప్ప‌పాటులో తొక్కిస‌లాట జ‌రిగింది. ఎనిమిది మంది టీడీపీ కార్య‌క‌ర్త‌లు మృతి చెంద‌డాన్ని త‌ట్టుకోలేక‌పోతున్నారు చంద్ర‌బాబు.

కందుకూరు స‌భకు జ‌న సందోహం (Nellore Postmortem)

అధికార‌ప‌క్షం మాత్రం చంద్ర‌బాబు అధికార దాహం అంటూ విమ‌ర్శ‌ల‌కు దిగుతోంది. స‌భ‌ల‌కు జ‌నం రాక‌పోవ‌డంతో ఉన్న వాళ్ల‌తోనే ఎక్కువ‌గా జ‌నం వ‌చ్చిన‌ట్టు చూప‌డానికి ఇరుకు రోడ్ల‌ను ఎంచుకుంటున్నార‌ని ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. డ్రోన్ కెమ‌రాల కోసం జ‌నాన్ని ఒక‌చోట నిల‌ప‌డానికి చేసిన ప్ర‌య‌త్నం ప్ర‌మాదానికి కార‌ణ‌మంటూ మంత్రి కాకాని గోవ‌ర్థ‌న్ రెడ్డి రాజ‌కీయ దాడికి  దిగారు. ఆయ‌న త‌ర‌హాలోనే వైసీపీకి చెందిన నాయ‌కులు మీడియా ముందుకొచ్చి చంద్ర‌బాబు అధికార దాహం ఎనిమిది మంది ప్రాణాల‌ను తీసుకుంద‌ని ఆరోపిస్తున్నారు.

Also Read : Chandrababu Sabha Stampede: చంద్రబాబు సభలో అపశృతి..7గురు మృతి!

గ‌తంలోనూ పుష్క‌రాల సంద‌ర్భంగా 29 మంది భ‌క్తుల‌ను బ‌లితీసుకున్నాడ‌ని గుర్తు చేస్తున్నారు. ఆనాడు ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను కెమెరాల్లో జ‌నాన్ని బంధించ‌డానికి ఒక్క‌సారిగా భ‌క్తుల‌ను ఒకే గేటు నుంచి బ‌య‌ట‌కు వ‌ద‌ల‌డంతో 29 మంది మృతి చెందార‌ని వైసీపీ చేస్తోన్న ఆరోప‌ణ‌. ఇవ‌న్నీ చంద్ర‌బాబు (CBN) ప‌బ్లిసిటీ పిచ్చి కార‌ణంగా జ‌రిగిన మ‌ర‌ణాల‌ని మంత్రి కాకానితో పాటు ప‌లువురు వైసీపీ లీడ‌ర్లు చేస్తోన్న రాజ‌కీయ దాడి.వాస్త‌వంగా చంద్ర‌బాబు అద్భుత స్పీక‌ర్ కాదు. గ్లామ‌ర్ హీరో అంత‌కంటే కాద‌ని తెలుసు. కొత్త‌గా వ‌చ్చిన లీడ‌ర్ కూడా కాదు. 40ఏళ్లుగా ప్ర‌తి ఒక్క‌రికీ తెలిసిన రాజ‌కీయ‌వేత్త‌. మారుమూల గ్రామానికి కూడా ఆయ‌న ఆహార్యం, స్పీచ్ బాగా తెలుసు. పూర్తిగా ఆయ‌న స్పీచ్ ను విన‌లేనంత బోర్ ఉంటుంద‌ని ఆ పార్టీకి చెందిన కొంద‌రు భావిస్తుంటారు. అలాంటి చంద్ర‌బాబును చూడ్డానికి, స్పీచ్ ను విన‌డానికి ఎందుకు జ‌నం ఎగ‌బడుతున్నారు? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.

ప్ర‌భుత్వం మీద విసిగిపోయిన జ‌నం

ప్ర‌స్తుతం ఉన్న ప్ర‌భుత్వం మీద విసిగిపోయిన జ‌నం చంద్ర‌బాబుకు మ‌ద్ధ‌తు ప‌లికేందుకు వ‌స్తున్నార‌ని అనుకోవ‌డం ఒక కోణం. డ‌బ్బుతో కొనుగోలు చేసి జ‌నాన్ని త‌ర‌లించ‌డం రెండో పాయింట్‌. కేవ‌లం తెలుగుదేశం పార్టీకి చెందిన కార్య‌క‌ర్త‌లు, వాళ్ల కుటుంబీకులు హాజ‌రు కావ‌డం మూడో అంశం. ఈ మూడు కోణాల‌ను విశ్లేషించుకుంటే ఏది నిజ‌మో అర్థం అవుతోంది.సాధార‌ణంగా ఏ రాజ‌కీయ పార్టీ అయినా ఎంతో కొంత డ‌బ్బు ఇచ్చి జ‌నాన్ని తీసుకొస్తుంటారు. కానీ, వాళ్ల‌కు టైమ్ చెబుతారు. టైమ్ పిరియ‌డ్ వ‌ర‌కు మాత్ర‌మే వాళ్లు ఉంటారు. ఆ త‌రువాత స‌భ నుంచి వెళ్లిపోతారు. చంద్ర‌బాబు స‌భ‌ల్లో ఆ విధంగా క‌నిపించ‌డంలేదు. ఆయన ప్ర‌సంగం ముగిసే వ‌ర‌కు ఉంటున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ కార్య‌క‌ర్త‌లు, వాళ్ల కుటుంబీకులు హాజ‌రైతే స‌భ‌ల్లో అంత జ‌నం క‌నిపించ‌రు. ఎందుకంటే, స‌కుటుంబ స‌మేతంగా పాల్గొనే అవ‌కాశం ఉండ‌దు. మ‌రి, చంద్ర‌బాబు స‌భ‌ల‌కు వ‌స్తున్న జ‌నం ఎవ‌రు? అనే ప్ర‌శ్న వేసుకుంటే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాల‌న మీద జ‌నం విసుగెత్తార‌ని భావించాలి. అందుకే, చంద్ర‌బాబుకు మ‌ద్ధ‌తు ఇవ్వ‌డానికి ల‌క్ష‌ల్లో జ‌నం కిక్కిరిసిపోతున్నార‌ని అనుకోవాలి.

Also Read : Nara Lokesh Padayatra : యువగళం పేరుతో నారా లోకేశ్ పాదయాత్ర

నెల్లూరు జిల్లా కందుకూరుకు చంద్ర‌బాబు వెళ్లిన రోజు వైసీపీ సీనియ‌ర్ లీడ‌ర్ ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జ‌నం దగ్గ‌ర‌కు వెళ్లి ఓట్లు ఎలా అడ‌గాలి? ఏం చెప్పాలి? అంటూ వైసీపీ ఎమ్మెల్యే మాట్లాడారు. అంతేకాదు, కందుకూరు వైసీపీ ఎమ్మెల్యే మానుగుంట మ‌హీంధ‌ర్ రెడ్డి కూడా మంచీనీళ్ల‌ను, త‌ట్ట మ‌ట్టిని రోడ్డు మీద వేయ‌లేని ప‌రిస్థితుల్లో ఉన్నామ‌ని గ‌తంలో అన్నారు. అంటే, మూడున్న‌రేళ్ల‌లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం ఏమీ చేయ‌లేద‌ని ఆ పార్టీ ఎమ్మెల్యే చెబుతున్నారు.రెండేళ్ల క్రిత‌మే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 15 మంది వైసీపీ ఎమ్మెల్యేలు బాహాటంగా వివిధ అంశాల‌పై జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాల‌న మీద వ్య‌తిరేకంగా మాట్లాడారు. ఆ సంఖ్య ఇప్పుడు అమాంత‌రం 50 నుంచి 60కి పెరిగింద‌ని తెలుస్తోంది. అందుకే, వాళ్ల గ్రాఫ్ బాగాలేద‌ని ఇటీవ‌ల జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తేల్చారు. ఇలాంటి ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌రిపాల‌న మీద విసిగిపోయిన జ‌నం చంద్ర‌బాబు స‌భ‌ల‌కు ల‌క్ష‌ల్లో హాజ‌రవుతున్నార‌ని అంచ‌నాకు వ‌స్తున్నారు.

పోలీసులు అప్ర‌మ‌త్త‌మైతే…

సాధార‌ణంగా ప‌బ్లిక్ మీటింగ్ లు, రోడ్ షో ల‌కు పోలీసుల అనుమ‌తి మందుగా తీసుకుంటారు. మాక్ డ్రిల్ కూడా చేస్తారు. స‌భ‌ల‌కు జ‌నం హాజ‌రు, రోడ్ షో మార్గం త‌దిత‌రాల‌ను ప‌ర్య‌వేక్షించ‌డం ద్వారా అంచ‌నా వేయాల‌లి. పైగా జ‌డ్ ప్ల‌స్ కేట‌గిరీలో ఉన్న చంద్ర‌బాబు స‌భ‌లంటే మ‌రింత జాగ్ర‌త్త తీసుకోవాలి. అలాంటి క‌స‌ర‌త్తు పోలీసుల నుంచి క‌నిపించ‌లేద‌ని కందుకూరు సంఘ‌ట‌న చెబుతోంది. కనీసం చంద్ర‌బాబు జాగ్ర‌త్త చెబుతున్న‌ప్పుడైనా పోలీసులు అప్ర‌మ‌త్త‌మైతే ఇంత పెద్ద ప్ర‌మాదం జ‌ర‌గ‌డానికి అవ‌కాశం ఉండేదికాదు. ఇవ‌న్నీ పోలీసు, నిఘా వైఫ‌ల్యాల కింద ప‌రిగ‌ణించాలి. అంటే, ప్ర‌భుత్వ వైఫ‌ల్యంగా భావించాలి. కానీ, చంద్ర‌బాబు అధికారదాహంతో కార్య‌క‌ర్త‌ల‌ను పొట్టున‌పెట్టుకున్నార‌ని వైసీపీ దాడికి దిగ‌డం గ‌మ‌నార్హం. దుర‌దృష్ట‌క‌ర సంఘ‌ట‌న‌ల మీద కూడా రాజ‌కీయం చేయ‌డానికి ప్ర‌య‌త్నించ‌డం శోచ‌నీయం.

Also Read : Chandrababu Road Show : చంద్ర‌బాబు రోడ్ షో సూప‌ర్ హిట్ ! ఏలూరులో జ‌న‌ప్ర‌భంజ‌నం!!