Janasena : ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సోదరుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు పేరు ఖరారైంది. ఎమ్మెల్యేల కోటా అభ్యర్థిగా నాగబాబు పేరును పవన్ ఖరారు చేశారు. నామినేషన్ వేయాలని నాగబాబుకు ఆయన సమాచారం ఇచ్చారు. నామినేషన్ కు అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. లోక్‌సభకు అంటూ ఒకసారి, లేదు ఎమ్మెల్సీ అంటూ మరోసారి.. కాదు కార్పొరేషన్ పదవి అంటూ మరోసారి ఊహాగానాలు వచ్చాయి. తాజాగా ఏపీలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్విడుదల చేయడంతో ఇప్పుడు ఈ అంశం తెరపైకి వచ్చింది.
ఎమ్మెల్సీ అభ్యర్థిగా శ్రీ @NagaBabuOffl గారి పేరు ఖరారు
శాసన సభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా శ్రీ కొణిదెల నాగబాబు గారి పేరును పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు ఖరారు చేశారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా శ్రీ నాగబాబు గారు… pic.twitter.com/B4yBXjG96X
— JanaSena Party (@JanaSenaParty) March 5, 2025
Read Also: NKR21 : కళ్యాణ్ రామ్ సినిమాకు టైటిల్ ఇదేనా?
కూటమి ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ సోదరుడు కొణిదెల నాగబాబుకు ఏ పదవి ఇవ్వాలనేదానిపై ఓ క్లారిటీ వచ్చింది. జనసేన పార్టీలో నాగబాబు కీలకంగా వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల సమయంలో ఆయన పార్టీకోసం విశేషంగా కృషి చేశారు. అయితే ఆయనకు ఆ సమయంలో సీటు దక్కలేదు. కూటమిలో సీట్ల సర్దుబాటులో ఆయన త్యాగం చేయాల్సి వచ్చింది. అయితే నాగబాబును కేబినెట్లోకి తీసుకుంటామని ప్రకటించడంతో అంతా ఓ క్లారిటీ వచ్చింది. ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవగానే ఆయనను శాసనమండలికి పంపి మంత్రి పదవి ఇస్తారని అంతా భావించారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబును ఖరారు చేసినట్లు సమాచారం.
కాగా, నాగబాబు ప్రస్తుతం జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సేవలందిస్తున్నారు. గత ఐదేళ్లుగా నాగబాబు జనసేన పార్టీ కోసం విస్తృతంగా పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఆయనను అనకాపల్లి నుంచి ఎంపీగా బరిలోకి దించాలని పార్టీ భావించింది. అయితే.. బీజేపీతో పొత్తు కుదరడంతో ఆ సీటును కూటమి నుంచి ఆ పార్టీకి కేటాయించారు. ఈ క్రమంలో ఆయనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేస్తూ జనసేన ప్రకటన విడుదల చేసింది. అయితే.. నాగబాబు మంత్రి పదవిపై ఆసక్తి చూపడం లేదని నిన్నటి నుంచి కొత్త ప్రచారం మొదలైంది. దీంతో ఆయనకు ఏదైనా కీలక కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. ఆయన ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం ఖాయం కాగా.. మంత్రి పదవి చేపడుతారా? లేదా? అన్న అంశంపై మరికొన్ని రోజుల్లో క్లారిటీ రావాల్సి ఉంది.