Mega DSC : ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ..మెగా డీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పారు. ఏప్రిల్ మొదటివారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. పాఠశాలల ప్రారంభం నాటికి పోస్టింగ్‌లు ఇవ్వాలని ఆదేశించారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించే ప్రక్రియ చేపట్టాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ప్రజలకు అందాలి. వచ్చే నెల మొదటి వారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తాం. జూన్‌లో పాఠశాలలు తెరిచేలోపు నియామకాలు పూర్తి కావాలి అని చంద్రబాబు అన్నారు. గత ఐదేళ్లలో ఒక వ్యక్తి రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. వైసీపీ ప్రభుత్వ పాలనను ప్రజలు ఆమోదించలేదు. గత పాలనతో విసిగి మాకు విస్తృత మద్దతు ఇచ్చారు.
Read Also: MLAs Defection Case : నేడు ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో విచారణ..!
టీచర్లకు ట్రైనింగ్ పూర్తిచేసి, జూన్ వరకల్లా పోస్టింగులు సైతం ఇవ్వాలని కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఉపాధ్యాయ ఉద్యోగాలు 80 శాతం భర్తీ చేశాం. పారదర్శకంగా ఉపాధ్యాయుల నియామకాలు చేపడతాం. మెగా డీఎస్సీ పకడ్బందీగా నిర్వహించాలి. లక్షా 50 వేలు ఉద్యోగాలు ఇచ్చాం. ప్రజలు కూడా మన ప్రభుత్వ సేవల్ని గుర్తుంచుకుంటున్నారు. ఇక, ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో 2 రోజుల పాటు జరగనున్న 3వ జిల్లా కలెక్టర్ల సమావేశం మంగళవారం ప్రారంభమైంది. ఈ సమావేశంలో కేబినెట్ మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి, వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు హాజరయ్యారు.
రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని ప్రజలకు హామీఇచ్చామని అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన తమ ప్రభుత్వ విధానమని చంద్రబాబు అన్నారు. సంక్షేమ పథకాలు లేకపోతే పేదరిక నిర్మూలన జరగదని.. సంక్షేమం అమలు చేయాలంటే అభివృద్ధి జరగాలని చంద్రబాబు అన్నారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఏసీ రూముల్లో కూర్చొని బయటికి రాకుండా పనిచేయాలంటే కుదరదని అన్నారు. ఒక్కో నాయకుడి పాలన ఒక్కోలా ఉంటుందని కొందరు అభివృద్ధి చేస్తే మరికొందరు నాశనం చేస్తారని సీఎం చంద్రబాబు అన్నారు.