ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ జంతు సంరక్షకురాలు మేనకా గాంధీ ఒక లేఖ రాశారు. తిరుపతిలో ఈ నెల 18, 19 తేదీల్లో జరగనున్న గంగమ్మ జాతర సందర్భంగా భారీ ఎత్తున జరిగే జంతు బలులను నిరోధించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. గంగమ్మ ఆలయం వద్ద జాతర పేరుతో పెద్ద సంఖ్యలో జంతువులను బలి ఇవ్వనున్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఈ హింసను ఆపాలని ఆమె కోరారు.
దేశంలో అనేక రాష్ట్రాలు ఇప్పటికే జంతు బలులను పూర్తిగా నిషేధించాయని మేనకా గాంధీ తన లేఖలో గుర్తుచేశారు. ఏపీకి పొరుగున ఉన్న కర్ణాటకలో కూడా జంతుబలులను నిషేధించి, వాటికి బదులుగా కొబ్బరికాయలు కొట్టేలా ప్రజలను ప్రోత్సహిస్తున్నారని ఆమె ఉదహరించారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలు సైతం ఈ విషయంలో కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు.
టెక్నాలజీతో పాటు అనేక విషయాల్లో దేశంలోనే అత్యంత ముందుచూపు ఉన్న ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు ఒకరని ప్రశంసించిన మేనకా గాంధీ, అలాంటి మీరు ఈ జంతుబలులను ఆపడం సాధ్యం కాదా? అని ప్రశ్నించారు. జంతుబలులు సమాజంలో హింసను ప్రేరేపిస్తాయని, ఇది మంచిది కాదని అభిప్రాయపడ్డారు. బలుల కోసం ఆలయాలకు వచ్చేవారు చాలా సందర్భాల్లో మద్యం సేవించి ఉంటారని, ఇది మరిన్ని హింసాత్మక ఘటనలకు దారితీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
“జాతర పేరుతో జరిగే ఈ మారణకాండను దేశం మొత్తం చూస్తోంది. ఇది దేశంలోనే అత్యంత దారుణమైన సామూహిక హత్యలుగా మారుతున్నాయి. ఏ కారణం లేకుండా వేలాది మూగజీవాలను చంపడం దారుణం” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయాల అభివృద్ధికి నిధులు ఇవ్వవచ్చని, జంతుబలులకు బదులుగా కొబ్బరికాయలు సమర్పించేలా భక్తులను చైతన్యపరచాలని సూచించారు. గతంలో కూడా ఎంతోమంది యువకులు, వైద్యులు, ప్రొఫెసర్లు ఈ బలులను ఆపాలని తనకు లేఖలు రాశారని పేర్కొన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని, తక్షణమే జంతుబలులను ఆపేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబును మేనకా గాంధీ కోరారు.
