Site icon HashtagU Telugu

Manchu Family : ‘విష్ణుం’వందే ‘జ‌గ‌న్’ గురుమ్!

Jagan Vishnu

Jagan Vishnu

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్‌(మా) అధ్య‌క్షుడు మంచు విష్ణు ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి స‌మీప బంధువు. ఆ కార‌ణంగా మంచు ఫ్యామిలీని ఏపీ రాజ‌కీయం వెంటాడుతోంది. ప్ర‌స్తుతం ఆ కుటుంబం రాజ‌కీయాల‌కు దూరంగా ఉంది. అయిన‌ప్ప‌టికీ జ‌గ‌న్ తీసుకునే నిర్ణ‌యాలు కొన్ని మంచు కుటుంబాన్ని వెంటాడుతున్నాయి. మొన్న‌టి వ‌ర‌కు ఫీజు రీయెంబ‌ర్స్ మెంట్, ప్ర‌స్తుతం జీవో నెంబ‌ర్ 35 మంచు హీరోల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.మంచు మోహ‌న్ బాబు స్వ‌ర్గీయ ఎన్టీఆర్ కు వీరాభిమాని. నంద‌మూరి కుటుంబానికి స‌న్నిహితంగా ఉంటారు. ఆ క్ర‌మంలో ఎన్టీఆర్ హ‌యాం నుంచి తెలుగుదేశం పార్టీకి మ‌ద్ధ‌తుగా ఉండే వాళ్లు. చంద్ర‌బాబు హ‌యాంలో మంచు మోహ‌న్ బాబు రాజ్య‌స‌భ స‌భ్యుడు అయ్యాడు. ఆ త‌రువాత మారిన రాజ‌కీయ ప‌రిణామాలు, అంత‌ర్గ‌త అంశాల కార‌ణంగా టీడీపీకి దూరం జ‌రిగాడు. స్వ‌ర్గీయ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి హ‌యాంలోనూ ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్న‌ప్ప‌టికీ ఆయ‌న‌కు వ్య‌క్తిగ‌త మ‌ద్ధ‌తు ఇచ్చాడు. ఆయ‌న మ‌ర‌ణం త‌రువాత జ‌రిగిన ప‌రిణామాలు వైసీపీ వైపు మంచు ఫ్యామిలీ వెళ్లింది.

Also Read : జ‌న‌సేనానికి ’35’ సినిమా

మాజీ సీఎం చంద్ర‌బాబుకు అత్యంత స‌మీప బంధువు మంచు మోహ‌న్ బాబు. అయిన‌ప్ప‌టికీ ఇంజ‌నీరింగ్ కాలేజికి ఫీజు రీయెంబ‌ర్స్ మెంట్ ను స‌కాలంలో ఏపీ స‌ర్కార్ నుంచి ఆనాడు పొంద‌లేక‌పోయాడు. దీంతో కాలేజి వ‌ద్ద రోడ్డు మీద ప‌డుకుని మోహ‌న్ బాబు నిర‌స‌న వ్య‌క్తం చేశాడు. కానీ, ఫ‌లితం లేక‌పోవ‌డంతో 2019 ఎన్నిక‌లకు ముందు చంద్ర‌బాబు మీద వ్య‌క్తిగ‌తంగా రాజ‌కీయ దాడికి దిగాడు. వైసీపీ ప‌క్షాన ప్ర‌చారం నిర్వ‌హించాడు. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సీఎం అయిన త‌రువాత మాత్రం మౌనంగా ఉన్నాడు.ఇటీవ‌ల జ‌రిగిన `మా` ఎన్నిక‌ల సంద‌ర్భంగా ప‌రోక్షంగా వైసీపీ మ‌ద్ధ‌తు మంచు ఫ్యామిలీకి ల‌భించింది. హోరాహోరీగా జ‌రిగిన ఆ ఎన్నిక‌ల్లో విష్ణు అధ్యక్షుడిగా గెలిచిన త‌రువాత వైసీపీ శ్రేణులు కేక్ క‌ట్ చేసి సంబ‌రాలు జ‌రుపుకున్నాయి. అంటే, విష్ణు గెలుపుకు వైసీపీ మ‌ద్ధ‌తు ల‌భించింద‌ని తేలిపోయింది. ఇరు కుటుంబాల మ‌ధ్య బంధుత్వం, సాన్నిహిత్యం ఉన్న‌ప్ప‌టికీ కాలేజి ఫీజుల రియెంబ‌ర్స్ మెంట్ విష‌యంలో మోహ‌న్ బాబు అసంతృప్తిగా ఉన్నాడు. అమ్మ ఒడి ప‌థ‌కం ద్వారా ఫీజు రీయెంబ‌ర్స్ మెంట్ లేకుండా చేసిన జ‌గ‌న్ స‌ర్కార్ ను ఏ మాత్రం కామెంట్ చేయ‌లేని స్థితిలో మంచు ఫ్యామిలీ ఉంది.

Also Read : ఏపీ హీరోల తెలంగాణ క‌థ‌

ప్ర‌స్తుతం జీవో నెంబ‌ర్ 35 ద్వారా సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల‌ను జ‌గ‌న్ స‌ర్కార్ త‌గ్గించింది. ఆ ధ‌ర‌లు సినిమా ప‌రిశ్ర‌మ‌ల‌కు గిట్టుబాటు కావ‌ని టాలీవుడ్ హీరోలు కొంద‌రు గ‌ళం మెత్తారు. ఆన్ లైన్ టిక్కెటింగ్‌, ధ‌ర‌ల త‌గ్గింపు అంశంపై ఏపీ స‌ర్కార్‌, టాలీవుడ్ మ‌ధ్య ప్ర‌చ్ఛ‌న్న యుద్ధం జ‌రుగుతోంది. ఇలాంటి విధాన‌ప‌ర‌మైన అంశాల‌పై స‌హ‌జంగా `మా` స్పందించాలి. కానీ, ఏ మాత్రం ఆ విష‌యాలు ప‌ట్ట‌న‌ట్టుగా మా అధ్య‌క్షుడు మంచు విష్ణు వ్య‌వ‌హారం ఉంది. ఆయ‌న వాల‌కంపై సినీ వ‌ర్గాలు గుర్రుగా ఉన్నాయి.సాధార‌ణంగా సినీ ప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన ప్ర‌తి అంశంపైన `మా` స్పందించాలి. విధాన‌ప‌ర‌మైన అంశాల‌పై అత్య‌వ‌స‌ర స‌మావేశం నిర్వహించ‌డం ద్వారా తీర్మానాల‌ను చేయాలి. ప్ర‌భుత్వాల‌తో లైజ‌నింగ్ చేసి స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం చూపాలి. త‌ద్భిన్నంగా ఏపీ, తెలంగాణ ప్ర‌భుత్వాలు తీసుకున్న నిర్ణ‌యాల‌పై విష్ణు మౌనంగా ఉన్నాడు. తెలంగాణ ప్ర‌భుత్వం సినిమా టిక్కెట్ల‌ను భారీగా పెంచింది. దానిపై కూడా విష్ణు స్పందించ‌డానికి స‌త‌మ‌తం అవుతున్నాడు. ఇక ఏపీ ప్ర‌భుత్వ వాల‌కంపై హీరోలు ప‌వ‌న్‌, సిద్ధార్థ‌, నాని మండిప‌డుతున్న‌ప్ప‌టికీ మంచు ఫ్యామిలీ సైలెంట్ గా ఉంది. అడ‌క‌త్తెర‌లో పోక‌చ‌క్క‌లా ఉన్న మా అధ్య‌క్షుడు విష్ణు వ్య‌వ‌హారం టాలీవుడ్ కు శాప‌మా? వ‌ర‌మా? అనేది సినీ పెద్ద‌లు చెప్పాలి.