ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కొనసాగుతున్నాయి. ఇవాళ విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పోలవరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే మిగతా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే పొలాల్లో పనిచేసే రైతులు, శ్రామికులు, పశువుల కాపరులు మరింత అప్రమత్తంగా ఉండి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.
మరోవైపు రాష్ట్రంలో వాతావరణ వివరాలను ఐఎండీ వెల్లడించింది. ఇవాళ ఉత్తరాంధ్ర, కోస్తాలోని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల పడే అవకాశముందని చెప్పారు. ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయంటున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లిలో 5.2 సెంటీమీటర్లు, కృష్ణా జిల్లా గుడివాడలో 3.5, పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురంలో 3.5, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో 3.3, ఏలూరు జిల్లా భీమడోలులో 3, ఏలూరు జిల్లా కైకలూరులో 2.9, విజయనగరంలో 2.7, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో 2.6, ఎన్టీఆర్ జిల్లా పాలేరు బ్రిడ్జి వద్ద 2.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని ఐఎండీ తెలిపింది.
మరోవైపు శుక్రవారం, శనివారం కోస్తా, రాయలసీమల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
వానలు పడే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అయితే కొన్ని చోట్ల ఎండ తీవ్రత కూడా కొనసాగుతోంది. మరోవైపు రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు కూడా మెల్లిగా విస్తరిస్తున్నాయి. వర్షాలు ఊపందుకుంటాయని భావిస్తున్నారు. అలాగే ఏపీపై ఎల్‌నినో ప్రభావం ఉంటుందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. రైతుల్ని ముందుగానే అలర్ట్ చేసి వారికి కొన్ని సూచనలు చేశారు. ఈసారి పంటల సాగు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
