ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగానికి భారీ ఊతం లభించింది. ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం, ఐకానిక్ మోటార్‌సైకిల్ బ్రాండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ తన నూతన తయారీ యూనిట్‌ను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయనుంది. 1901లో సంస్థ ప్రారంభమైన నాటి నుంచి తమిళనాడు వెలుపల ఇంత భారీ స్థాయిలో విస్తరించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
తిరుపతి జిల్లా సత్యవేడులో ఈ అత్యాధునిక తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం కంపెనీ రెండు దశల్లో సుమారు రూ. 2,200 కోట్లు పెట్టుబడిగా పెట్టనుంది. ఈ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) ఆమోదం తెలిపింది. ఈ ప్లాంట్ ద్వారా రాయల్ ఎన్‌ఫీల్డ్ తయారీ సామర్థ్యం దాదాపు 9 లక్షల యూనిట్లు పెరగనుంది.
ఈ ప్రాజెక్టు కోసం సత్యవేడు మండలంలోని వన్నెలూరు (233.76 ఎకరాలు), రాళ్ళకుప్పం (42.38 ఎకరాలు) గ్రామాల్లో ప్రభుత్వం మొత్తం 267 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 5,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మొదటి దశలో ప్రధాన తయారీ యూనిట్‌తో పాటు, ఒక ప్రత్యేక వెండర్ పార్క్‌ను కూడా అభివృద్ధి చేయనున్నారు. దీనివల్ల సంస్థకు చెందిన సరఫరాదారులు కూడా ఏపీకి తరలివచ్చి, రాష్ట్రంలో ప్రపంచ స్థాయి ఆటోమోటివ్ తయారీ క్లస్టర్ ఏర్పడటానికి దోహదపడుతుంది. మొదటి దశ 2029 నాటికి, రెండో దశ 2032 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ పరిణామంపై రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. “రాయల్ ఎన్‌ఫీల్డ్ కేవలం ఒక మోటార్‌సైకిల్ బ్రాండ్ కాదు, అది వారసత్వం, నాణ్యతకు ఒక ప్రతీక. ఇంతటి ఐకానిక్ కంపెనీని ఏపీకి స్వాగతిస్తున్నందుకు గర్వంగా ఉంది. వ్యాపార నిర్వహణలో ఏపీ వేగం, ఇక్కడి మౌలిక సదుపాయాలకు ఈ పెట్టుబడి నిదర్శనం. ఈ ప్లాంట్‌తో పాటుగా వచ్చే అనుబంధ పరిశ్రమలతో రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి ఆటోమొబైల్, అడ్వాన్స్‌డ్ మానుఫ్యాక్చరింగ్ హబ్‌గా తీర్చిదిద్దాలన్న మా లక్ష్యం మరింత బలపడుతుంది” అని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుతో ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంతంలో పారిశ్రామికాభివృద్ధి మరింత వేగవంతం కానుంది.
