Supreme Court: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసం, టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ దాడి వ్యవహారాన్ని ఇవాళ విచారించిన సుప్రీంకోర్టు ముఖ్యమైన ఆదేశాలను జారీ చేసింది. వైఎస్సార్ సీపీ నేతలు జోగి రమేష్, దేవినేని అవినాష్‌లు దేశం విడిచి వెళ్లకూడదని, దర్యాప్తునకు సహకరించాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆర్డర్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే.. చంద్రబాబు నాయుడు నివాసం, టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి వ్యవహారంపై జోగి రమేష్, దేవినేని అవినాష్ సహా 20 మంది సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. వాటిపై విచారణ నిర్వహించిన సుప్రీంకోర్టు.. దేవినేని అవినాష్, జోగి రమేష్ సహా 20 మందికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
Also Read :Preity Zinta Loan : ‘‘ప్రీతీ జింతాకు రుణమాఫీ’’.. కాంగ్రెస్ ఆరోపణ.. హీరోయిన్ రియాక్షన్
రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు
సుప్రీంకోర్టులో(Supreme Court) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులోని నిందితులు మూడేళ్లుగా బెయిల్ కానీ, ముందస్తు బెయిల్ కానీ కోరలేదన్నారు. ప్రభుత్వం మారిన తర్వాతే కోర్టు మెట్లు ఎక్కారని చెప్పారు. ‘‘నిందితులకు తాము తప్పు చేశామని తెలుసు. ప్రభుత్వం మారాక తప్పు బయటపడుతుందని తెలిసి సుప్రీంకోర్టును ఆశ్రయించారు’’ అని ప్రభుత్వం తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు బెంచ్‌కు తెలియజేశారు. ‘‘ జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న చంద్రబాబు ఇంటిపై దాడి చేశారు. అంతటితో ఊరుకోకుండా ఎస్సీ, ఎస్టీ కేసు కూడా పెట్టించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడిలో ప్రధాన సూత్రధారి, పాత్రధారి దేవినేని అవినాష్. దర్యాప్తునకు అవినాష్ అస్సలు సహకరించడం లేదు’’ అని సుప్రీంకోర్టు ధర్మాసనానికి ప్రభుత్వ న్యాయవాది చెప్పారు.
Also Read :Mysterious Hair Loss: గోధుమల దెబ్బకు జుట్టు రాలుతోంది.. ఆ జిల్లాలో కలకలం
సుప్రీంకోర్టు ధర్మాసనం కామెంట్స్
ఈ వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక కామెంట్స్ చేసింది. ‘‘ఈ కేసుపై గత మూడేళ్లుగా దర్యాప్తు చేయకుండా చాలా తాత్సారం చేశారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌ను ఉల్లంఘించారు. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ నిందితులు పిటిషన్లు వేశారు. ఈ కేసులో జోక్యం చేసుకునేందుకు తగిన కారణాలు కనిపించలేదు. జోగి రమేష్, దేవినేని అవినాష్ దేశం విడిచి వెళ్లకూడదు. దర్యాప్తునకు సహకరించాల్సిందే’’ అని దేశ సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది.