ఆంధ్రప్రదేశ్ లో వరుసగా వైసీపీ నేతలఫై (YCP Leaders) కేసులు ఉత్కంఠకు గురి చేస్తున్నాయి. లిక్కర్ స్కాం, క్వార్ట్జ్ గనుల అక్రమాలు, రాజకీయ నేతల అరెస్టులు వంటి అంశాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు కావడం, మాజీ మంత్రులపై కేసులు నమోదవడం, కొంతమంది నేతలు ముందస్తు బెయిలు కోసం ప్రయత్నించడం ఇలా అన్ని కలిపి పార్టీపై తీవ్ర ఒత్తిడిని తీసుకొస్తున్నాయి. ఇదే సమయంలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్టు అయ్యే అవకాశాలు ఉన్నాయన్న వార్తలు ఊపందుకోవడంతో ఆయన ఢిల్లీ వెళ్లే అవకాశాలపై ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి.
ఈ కేసులను కేంద్రం లేదా చంద్రబాబు ప్రభుత్వం తనపై రాజకీయ ప్రతీకారంగా వాడుతోందని ప్రజల్లో నమ్మకం కలిగించాలనే లక్ష్యంతో జగన్ ఢిల్లీ (Jagan Delhi ) వెళ్లే ఆలోచనలో ఉన్నారని సమాచారం. అక్కడ ధర్నా చేయడం లేదా విపక్ష పార్టీలను కలవడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగ విరుద్ధంగా పాలన సాగుతోందని ప్రచారం చేయాలని వైఎస్సార్‌సీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే బెంగళూరు నుంచి తనకు మద్దతు తెలిపిన పార్టీలను సంప్రదిస్తున్నట్టు సమాచారం. ఈ కారణంగానే జగన్ ఈ వారం తాడేపల్లికి రాలేదన్న ప్రచారం జరుగుతోంది.
Non-veg Food: శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినకూడదా? కారణాలీవే?!
గతంలో ఢిల్లీలో జరిగిన ధర్నాలో శివసేన సహా ఇండీ కూటమిలోని పలు పార్టీలు జగన్‌కు మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే, జగన్ తర్వాత ఎన్డీఏకు సమర్థన తెలిపిన తీరు, విపక్ష కూటమికి సహకారం లభించనట్టుగా వ్యవహరించడం వల్ల, ఇప్పుడు అదే పార్టీలు మళ్లీ మద్దతు ఇవ్వడం సందేహాస్పదంగా మారింది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, గతంలో మద్దతిచ్చిన పార్టీలు ఈసారి పక్కకు జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
జగన్‌కు ప్రధాన విపక్షమైన కాంగ్రెస్ నుంచి కూడా ఎలాంటి మద్దతు లభించే అవకాశం లేదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఏపీ పీసీసీ ఇంచార్జ్‌తో పాటు పార్టీ అధ్యక్షురాలు షర్మిల కూడా జగన్‌పై ఘాటు విమర్శలు చేస్తుండటంతో, కాంగ్రెస్ సహా ఇతర ముఖ్యమైన విపక్ష పార్టీల మద్దతు ఆయనకు దూరంగా ఉన్నట్టే కనిపిస్తోంది. మొత్తంగా చెప్పాలంటే, జగన్ ఢిల్లీకి వెళ్లే ప్రణాళిక ఉంటే అది రాజకీయంగా చర్చనీయాంశంగా మారినా, మద్దతు విషయంలో మాత్రం ఆయన ఒంటరివాడై అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చూద్దాం మరి ఏంజరుగుతుందో !!