Rivers Inter Linking : ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారంలోకి రావడంతో గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధానం ప్రాజెక్టుపై మళ్లీ కదలిక వచ్చింది. ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ఏపీకి ఆర్థికసాయం చేయాలని కేంద్ర సర్కారును ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవలే కోరారు. గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధాన ప్రక్రియ పూర్తయితే దక్షిణ కోస్తాలోని ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమలోని ఉమ్మడి నాలుగు జిల్లాలకు మేలు కలుగనుంది. ఈ మూడు నదుల అనుసంధాన ప్రాజెక్టుకు దాదాపు రూ.60 వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందని ఏపీ సర్కారు అంచనా వేస్తోంది. ఈ ఖర్చును ఏపీ ప్రభుత్వం ఒక్కటే భరించలేదని, కేంద్రం కూడా సహకరించాలని చంద్రబాబు ఇటీవలే ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. త్వరలో డీపీఆర్ సిద్ధంచేసి పంపుతామని ఆమెకు తెలిపారు.
Also Read :Old Vehicles : కాలం చెల్లిన వాహనాలు @ 42 లక్షలు.. వీటిలో టూవీలర్స్ 31 లక్షలు
పోలవరం కుడి ప్రధాన కాలువ కెపాసిటీని పెంచి..
పల్నాడు జిల్లా వినుకొండ సమీపంలోని బొల్లాపల్లి వద్ద రిజర్వాయర్‌ను నిర్మించి, అక్కడి నుంచి బనకచర్లకు జలాలను తీసుకెళ్లి రాయలసీమను అనుసంధానించాలన్నది గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధాన ప్రాజెక్టు లక్ష్యం. ప్రస్తుతానికి గోదావరి నుంచి పోలవరం ద్వారా ప్రకాశం బ్యారేజీ(Rivers Inter Linking) వరకు జలాలు వస్తున్నాయి. ప్రకాశం బ్యారేజీ నుంచి నాగార్జునసాగర్ కుడికాలువలోకి నీరు ఎత్తిపోయడానికి 2015-16లోనే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. కొన్ని కారణాల వల్ల ఆ తర్వాత ప్రాజెక్టు ముందుకు సాగలేదు. పోలవరం కుడి ప్రధాన కాలువ నుంచి ప్రకాశం బ్యారేజీకి, సమీపాన వైౖకుంఠపురం ఎత్తిపోతల పథకం నుంచి బొల్లాపల్లి రిజర్వాయరు-బనకచర్ల హెడ్ రెగ్యులేటర్‌కు గోదావరి జలాలను తరలించే అంశాన్ని ఏపీ జల వనరుల శాఖ పరిశీలిస్తోంది. గోదావరి జలాలను పోలవరం కుడి ప్రధాన కాలువ ద్వారా ప్రకాశం బ్యారేజీకి తరలించేందుకు గత టీడీపీ హయాంలో పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టారు. పోలవరం కుడి ప్రధాన కాలువ ప్రస్తుత సామర్థ్యం ప్రకారం దాని ద్వారా కృష్ణా డెల్టాకు 17,561 క్యూసెక్కుల నీటిని మాత్రమే తరలించవచ్చు. ఈ కాలువ లోతును ఆరు మీటర్లకు తవ్వితే రోజూ 40,674 క్యూసెక్కుల నీటిన తరలించే ఛాన్స్ ఉంటుంది.
Also Read :10 Children Died: పండగపూట విషాదం.. 10 మంది చిన్నారులు సజీవదహనం!
ప్రతిపాదన ఇదీ..
వర్షకాలం సీజన్‌లో పోలవరం ప్రధాన కుడి కాలువ నుంచి గోదావరి మిగులు జలాలను రోజుకు 2 టీఎంసీల చొప్పున కృష్ణా నదికి తరలిస్తారు. ప్రకాశం బ్యారేజీ సమీపంలోని వైకుంఠపురం నుంచి కొత్త కాలువల ద్వారా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని బొల్లాపల్లికి పంపుతారు. అక్కడ రిజర్వాయర్‌ను నిర్మించి, దాని ద్వారా నల్లమల మీదుగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని బనకచర్లకు తీసుకెళ్తారు. బనకచర్ల నుంచి సోమశిల, తెలుగుగంగ, గాలేరు-నగరి, హంద్రీనీవాకు పంపి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలను సస్యశామలం చేస్తారు.