Minister Lokesh : అమరావతి పునఃనిర్మాణ సభలో అమరావతి నమో నమః అని రెండు సార్లు అంటూ తన ప్రసంగాన్ని ఐటీ మినిస్టర్ నారా లోకేష్ ప్రారంభించారు. ఒక్క పాకిస్థాన్ కాదు.. వంద పాకిస్థాన్‌లు వచ్చినా భారత్‌ను ఏమీ చేయలేరని మంత్రి నారా లోకేశ్ అన్నారు. నమో కొట్టే దెబ్బకు పాకిస్థాన్ దిమ్మ తిరగడం ఖాయం. భారత గడ్డపై గడ్డి మొక్క కూడా పీకలేరు. మోడీకి ఏపీ అంటే ప్రత్యేక అభిమానం. ఏపీ ప్రాజెక్ట్‌లకు ఆమోదం చెబుతూ మద్దతు ఇస్తున్నారు. అందుకే ఇంత బిజీ షెడ్యూల్‌లో కూడా ఆయన రాష్ట్రానికి వచ్చారు. కావాల్సినన్ని నిధులు కేటాయిస్తున్నారు. పాక్‌పై చర్యలు ఎలాంటివి అయినా దేశం ఆయనకు మద్దతుగా ఉంటుందన్నారు లోకేష్. నమో ప్రారంభించిన అమరావతిని ఆపే దమ్ము ఎవరికి లేదు. ఇక అమరావతి అన్‌స్టాపబుల్. ఇకపై అన్ని కార్యక్రమాలు జెట్ స్పీడ్‌తో సాగుతాయి అన్నారు.
Read Also: Amaravati Relaunch : అమరావతి ప్రపంచస్థాయి సర్వశ్రేష్ఠ రాజధానిగా ఆవిర్భవిస్తుంది – పవన్
2014లో మనల్ని మెడపట్టి గెంటేశారు. రాజధాని కూడా లేకుండానే విడిపోయాం. చంద్రబాబు ఆత్మస్థైర్యం కోల్పోకుండా రాష్ట్రాన్ని నిలబెట్టారు. చంద్రబాబుపై కోపంతో కొందరు రాజధానిని పక్కనబెట్టారు. అమరావతికి అండగా ఆంధ్రా ప్రజలంతా నిలబడ్డారు అన్నారు. గత ప్రభుత్వం దొంగ కేసులు పెట్టి ఎన్ని కుట్రలు చేసినా జై అమరావతి నినాదాలను మాత్రం ఆపలేకపోయింది. ఆపేదానికి.. పీకేదానికి అమరావతి ఎవరి ఇంట్లోనో పెంచుకున్న మొక్క కాదు.. జనం గుండెల్లో దాచుకున్న ప్రజా రాజధాని. రైతులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా అని లోకేశ్ అన్నారు. ఎన్ని నిర్బంధాలు ప్రయోగించినా అమరావతి రైతులు తగ్గేదే లే అన్నారు.
మరోవైపు ప్రధాని మోడీ హాజరైన అమరావతి పునర్ నిర్మాణ పనుల ప్రారంభోత్సవ సభలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ముఖ్య నేతలందరూ సభా వేదికపై ఆశీనులై ఉండగా… ప్రధాని మోడీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను దగ్గరకు పిలిచారు. ప్రధాని ఎందుకు పిలిచారోనని పవన్ హడావిడిగా వచ్చారు. అప్పుడు ప్రధాని మోడీ తన వద్ద ఉన్న చాక్లెట్ ను పవన్ కు ఇవ్వడంతో వేదికపై నవ్వులు విరబూశాయి. మోడీ, చంద్రబాబు నవ్వడంతో పవన్ కూడా చేతిలో ఉన్న చాక్లెట్ ను చూసుకుని వారితో కలిసి తాను కూడా నవ్వేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.