Andhra Pradesh Assembly And Lok Sabha Seats ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల పెంపు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. కేంద్రం 2029 ఎన్నికల నాటికి సీట్ల సంఖ్యను 50 శాతం పెంచే అవకాశం ఉందని అంటున్నారు. ఢిల్లీలో సోమవారం జరిగిన ఎన్డీఏ సమావేశంలో ఈ సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ సీట్లు పెరిగితే ఏపీలో అసెంబ్లీ స్థానాలు 263, లోక్‌సభ స్థానాలు 38కి పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల పెంపు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య పెంచే అవకాశాలను కేంద్రం పరిశీలిస్తుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా కేంద్రం అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలను ఏకంగా 50 శాతం పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే సీట్ల పెంపునకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఒకవేళ అదే జరిగితే లోక్‌సభ స్థానాలు 534 నుంచి 816కు చేరతాయంటున్నారు. ఇక అన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతం 4,123గా ఉన్న అసెంబ్లీ స్థానాలు 6,185కు పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
ఒకవేళ కేంద్రం అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచితే, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 175 ఎమ్మెల్యే స్థానాలు 263కి పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. అలాగే తెలంగాణలో ప్రస్తుతం 119 ఉన్న అసెంబ్లీ స్థానాలు 179కి చేరతాయని అంటున్నారు. ఇక లోక్‌సభ స్థానాల విషయానికి వస్తే, ఏపీలో ప్రస్తుతం 25 లోక్‌సభ స్థానాలు ఉంటే, అవి 38కి పెరిగే అవకాశం ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 17 లోక్‌సభ స్థానాలు ఉండగా, అవి 26కు పెరిగే అవకాశం ఉంది. ఢిల్లీలో సోమవారం జరిగిన ఎన్డీయే సమావేశంలో కేంద్రం ఈ సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీతో కూడా ఈ అంశంపై కేంద్రం చర్చించబోతున్నట్లు సమాచారం.
ఆంధ్రప్రఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సీట్లు – జిల్లా వారీగా (ఇది ప్రస్తుత అంచనాల ఆధారంగా సిద్ధం చేసిన సమాచారం)
గ్రేటర్ రాయలసీమ (6 జిల్లాలు)
అనంతపురం 14➝21 (+7)
కర్నూలు 14➝21 (+7)
కడప 10➝15 (+5)
చిత్తూరు 14➝21 (+7)
నెల్లూరు 10➝15 (+5)
ప్రకాశం 12➝18 (+6)
మొత్తం: 74➝111 (+37)
గుంటూరు – కృష్ణా
గుంటూరు 17➝25 (+8)
కృష్ణా 16➝24 (+8)
మొత్తం: 33➝49 (+16)
గోదావరి జిల్లాలు (ఈస్ట్–వెస్ట్)
ఈస్ట్ గోదావరి 19➝28 (+9)
వెస్ట్ గోదావరి 15➝22 (+7)
మొత్తం: 34➝50 (+16)
ఉత్తరాంధ్ర
విశాఖ 15➝23 (+8)
విజయనగరం 9➝15 (+6)
శ్రీకాకుళం 10➝15 (+5)
మొత్తం: 34➝53 (+19)
ముఖ్య గణాంకాలు
మొత్తం సీట్లు: 175➝263 (+88)
మ్యాజిక్ ఫిగర్: 132
ప్రతిపక్ష హోదా: ~26
మంత్రివర్గంప్రస్తుతం: 26
పెంపు తర్వాత: 39 వరకు
పెరుగుదల: +13
ఎమ్మెల్సీలుప్రస్తుతం: 58
పెంపు తర్వాత: 87–88 వరకు
పెరుగుదల: +29/+30
ఎంపీలు (లోక్‌సభ)ప్రస్తుతం: 25
పెంపు తర్వాత: 37–38 (అంచనా)
పెరుగుదల: +12/+13
రాజ్యసభ ప్రస్తుతం: 11
అసెంబ్లీ సీట్లు పెరిగినా వెంటనే మార్పు ఉండదు
భవిష్యత్తులో జనాభా/డిలిమిటేషన్ ఆధారంగా మారే అవకాశం
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ సీట్లు 175 నుంచి 263కి పెరుగుతూ మొత్తం 88 సీట్లు అదనంగా రానున్నాయి… ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 132 సీట్లు అవసరం… మంత్రివర్గం, ఎమ్మెల్సీలు, ఎంపీ సీట్లు కూడా పెరిగే అవకాశం ఉంది.
అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్యను పెంచడానికి వీలుగా కొన్ని సవరణలు చేయాల్సి వస్తోంది. అందుకే ముందుగా పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ చట్టం, డీలిమిటేషన్ చట్టాలకు సవరణలు ప్రతిపాదిస్తూ బిల్లులు తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత కేంద్రం డీలిమిటేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేసి సీట్ల పెంపుపై దృష్టి పెడుతుందంటున్నారు. 2029 నాటికి అన్ని పనులు పూర్తి చేసి.. వచ్చే ఎన్నికల నుంచి పెరిగిన సీట్లను అమలు చేయనున్నట్లు సమాచారం. ఒకవేళ నియోజకవర్గాల సంఖ్య పెరిగితే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కూడా పెరుగుతాయని అంచనాలు ఉన్నాయి.
కేంద్రం మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం 2023 సెప్టెంబరులో బిల్లును ఆమోదించింది. ఈ బిల్లు ప్రకారం మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు 2034 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. అయితే 2026 తర్వాత ప్రచురించే జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేయాలనే నిబంధన ఉంది. కానీ 2027 మార్చి నాటికి జనగణన పూర్తి కానుండటంతో జనాభా లెక్కల వివరాలు ప్రాథమికంగా ప్రకటించి ఆ వెంటనే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను మొదలు పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలో మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.
అయితే జనగణన తర్వాత వచ్చే లెక్కల ఆధారంగా సీట్లను పెంచితే దక్షిణాది ప్రాంతానికి అన్యాయం జరుగుతుందనే వాదన కూడా ఉంది. అందుకే కేంద్రం అలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ, అసెంబ్లీ సీట్లను 50 శాతం పెంచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అప్పుడు అన్ని రాష్ట్రాలకూ ఇబ్బందులు ఉండవనేది కేంద్రం సరికొత్త ఆలోచన. అందుకే అన్ని పార్టీల మద్దతు కూడగట్టే పనిలో ఉన్నారని సమాచారం. ఈ ప్రతిపాదనలపై చర్చించేందుకు ఇవాళ విపక్ష నేతలు సమావేశమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే సీట్ల పెంపు అంశంపై కేంద్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కసరత్తు మొదలు పెట్టినట్లు మాత్రమే సమాచారం అందుతోంది.
