Annadata Sukhibhava Scheme : రాష్ట్రంలోని అర్హత కలిగిన ప్రతి రైతు ఖాతాలో ఈనెల 20న రెండు ముఖ్య పథకాల ద్వారా డబ్బులు జమ కానున్నాయి. అన్నదాత సుఖీభవ (రాష్ట్ర ప్రభుత్వం అందించే నిధి) మరియు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి (కేంద్ర ప్రభుత్వ పథకం) కలిపి మొత్తం రూ.7000 ప్రతి అర్హ రైతు ఖాతాలో జమ కానుంది. అయితే ఈ మొత్తం విడుదలకు ముందు ప్రతి ఒక్క రైతు తప్పనిసరిగా థంబ్ ఇంప్రెషన్ (వెరీఫికేషన్) చేయాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా రైతు సేవా కేంద్రాల్లో (RBKs) ఈ థంబ్ వెరిఫికేషన్ ప్రక్రియ మొదలైంది. వ్యవసాయ శాఖ అధికారుల ప్రకారం, రైతులు తమ ఆధార్‌తో పాటు తమ మొబైల్ ఫోన్ తీసుకుని దగ్గరిలో ఉన్న రైతు సేవా కేంద్రానికి వెళ్లాలి. అక్కడ బయోమెట్రిక్ ద్వారా ధృవీకరణ జరగాల్సి ఉంటుంది. ఇది పూర్తైన తర్వాతే వారి ఖాతాలో సొమ్ము జమ చేసే ప్రక్రియ మొదలవుతుంది.
Read Also: Cyprus : ప్రధాని మోడీకి సైప్రస్ అత్యున్నత పురస్కారం
ఈ థంబ్ వెరిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రైతుకు తప్పనిసరి. ఏ గ్రామంలోని రైతు అయినా, రాష్ట్రంలోని ఏ రైతు సేవా కేంద్రంలో అయినా ఈ ధృవీకరణ చేయొచ్చు. తమ గ్రామానికి చెందిన రైతు సేవా కేంద్రానికి వెళ్లే అవసరం లేదు. ఇది రైతులకు మరింత సౌకర్యంగా ఉండేందుకు తీసుకున్న నిర్ణయం అని అధికారులు పేర్కొంటున్నారు. పాత పథకాలపై తప్పులుండటం, డబుల్ ఎంట్రీలు, నకిలీ ఖాతాలు వంటి సమస్యల నివారణకోసం ఈసారి ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ ధృవీకరణ ద్వారా అర్హులు మాత్రమే లబ్ధి పొందేలా చూసే ప్రయత్నం జరుగుతోంది. పథకానికి అనర్హులైన వారు ఈ సారి బయటపడే అవకాశం ఉంది.
ఇకపోతే, పథకం అమలులో ప్రభుత్వం స్పష్టమైన టైమ్‌లైన్‌ను ఖరారు చేసింది. జూన్ 16 నుండి 19 వరకు థంబ్ వేయాల్సి ఉంటుంది. ఈ తేదీల్లో ధృవీకరణ చేయని రైతులకు డబ్బులు జమ కాబోవు. ప్రభుత్వం తరఫున అధికారులు గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. గ్రామ వాలంటీర్లు, వ్యవసాయ విభాగం అధికారులు రైతులను వ్యక్తిగతంగా కలుసుకుని అప్రమత్తం చేస్తున్నారు. రైతులు ఈ అవకాశాన్ని వదులుకోకుండా తగిన ధృవీకరణను చేయాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాకుండా, ప్రభుత్వానికి రైతుల గురించి ఖచ్చితమైన డేటా ఉండేందుకు కూడా ఉపయోగపడుతుంది.