IMD Issues Rainfall Alert to Telangana And AP : గత కొద్దీ రోజులుగా తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు (Heavy Rains in Telugu States) వదలడంలేదు. గత వారం శుక్ర , శని , ఆదివారాల్లో కురిసిన భారీ వర్షాలకు రెండు రాష్ట్రాలు అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఈ వర్షాల బారినుండి ఇంకా ప్రజలు తేరుకోనేలేదు. ఇప్పుడు మరోసారి భారీ వర్షాలు మొదలవ్వడం ప్రజల్లో ఖంగారు పెట్టిస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారిందని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో ఈరోజు, రేపు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం దాని ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని ఇది ఉత్తర దిశగా కదులుతూ ఈ నెల 9వ తేదీకి ఒడిశా, పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు సమీపంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
అల్పపీడనం కారణంగా..ఏపీలో శ్రీకాకుళం, పార్వతిపురం మన్యం, విజయనగరం, అల్లూరి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తున్న నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. శనివారం ఉదయం కంచికచర్లలో 33 మిల్లీ మీటర్లు, సాయంత్రం 6 గంటలకు మరో 50 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. నందిగామ, తిరువూరు, మైలవరం, ఇబ్రహీంపట్నం, జగ్గయ్యపేటతో పాటు, విజయవాడ నగరంలోనూ వర్షం దంచికొట్టింది.
ఇక తెలంగాణలోను శనివారం పలు జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. ఆది, సోమవారాల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నెల 8వ తేదీన కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 9వ తేదీన ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Read Also : REAL HERO Subhan Khan : సుభాన్ ఖాన్ ను సన్మానించిన అసదుద్దీన్ ఒవైసీ