విశాఖకు చెందిన జెస్సికా మృతి కేసులో పోలీసులు జరిపిన విచారణలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఈనెల 14న విశాలాక్షినగర్‌లోని ఒక లాడ్జిలో స్నేహితుడి బర్త్‌డే వేడుకల కోసం జెస్సికా తన మిత్ర బృందంతో కలిసి వెళ్లింది. అక్కడ పార్టీ జరుగుతున్న సమయంలో స్నేహితుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. తన గురించి తప్పుడు ప్రచారం చేస్తోందన్న నెపంతో సాయికిరణ్ అనే స్నేహితుడు జెస్సికాని నిలదీశాడు. ఈ క్రమంలో సాయికిరణ్, లక్ష్మీ సౌజన్య, యశ్వంత్ కలిసి ఆమెపై భౌతిక దాడికి దిగారు. స్నేహితులందరూ చూస్తుండగానే జరిగిన ఈ దాడితో జెస్సికా తీవ్ర మనస్థాపానికి గురైంది. దెబ్బల ధాటికి ఆమెకు ఫిట్స్ కూడా వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.
ఆత్మహత్యగా మలుపు- హోటల్ గదిలో విషాదం
దాడి జరిగిన అనంతరం భయపడిన స్నేహితులు ఆమెకు నీళ్లు తాగిపి, ఆమె పేరు మీద బుక్ చేసిన 118 నంబర్ గదిలోకి పంపించారు. తన సన్నిహితులే తనపై దాడి చేయడాన్ని జీర్ణించుకోలేకపోయిన జెస్సికా, అదే గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కొంత సమయం తర్వాత స్నేహితులు వెళ్లి తలుపు తట్టినా స్పందన లేకపోవడంతో, తలుపులు పగులగొట్టి చూడగా ఆమె అపస్మారక స్థితిలో కనిపించింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తొలుత ఫిట్స్ రావడం వల్లే చనిపోయిందని స్నేహితులు నమ్మబలికనప్పటికీ, పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది.
కుటుంబ సభ్యుల ఆరోపణలు – పోలీసుల దర్యాప్తు
జెస్సికా మృతిపై ఆమె కుటుంబ సభ్యులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది ముందస్తు ప్లాన్ ప్రకారం జరిగిన హత్యేనని, ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు హోటల్‌లోని సీసీ కెమెరాల దిశను కూడా మార్చారని వారు ఆరోపిస్తున్నారు. హోటల్ యాజమాన్యం సమాచారం ప్రకారం, జెస్సికానే తన గుర్తింపు కార్డు సమర్పించి గదిని బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అరిలోవా పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు (Abetment to Suicide) కేసు నమోదు చేశామని, పూర్తి స్థాయి విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షిస్తామని సీఐ మల్లేశ్వరరావు తెలిపారు.
