చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లను కల్పించే చట్టాన్ని 2034 నుంచి అమలు చేయాలని ఆమోదించిన సమయంలో పేర్కొన్నారు. అయితే, దీనిని ముందుకు జరిపి 2029 నుంచే అమలుచేయాలని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే డీలిమిటేషన్ ద్వారా లోక్‌సభ, అసెంబ్లీ సీట్లను పెంపు, పునర్విభజనకు వీలుగా మూడు కీలక బిల్లులను గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. అనంతరం ఈ బిల్లులపై చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై పార్లమెంటులో చర్చ సందర్భంగా విపక్షాల ఆరోపణలను అధికార బీజేపీ తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనపై బీజేపీ యువ ఎంపీ తేజస్వీ సూర్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏర్పాటును ఆయన పాకిస్థాన్ విభజనతో పోల్చారు. ఏపీ విభజనను బ్రిటిషర్ల కంటే దారుణంగా చేశారని ఆరోపించారు. విభజన సమయంలో తెలుగు ప్రజల భావోద్వేగాలు, ఆర్థిక వనరులను కాంగ్రెస్ పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ఆ పాపం ఇప్పటికీ ఆ పార్టీని వెంటాడుతూనే ఉందని ఆయన విమర్శించారు. విభజన గాయాల నుంచి ఇప్పటికీ ఏపీ కోలుకోలేదని, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జరిగిన అన్యాయానికి కాంగ్రెసే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా డీలిమిటేషన్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన హైబ్రిడ్ విధానాన్ని తేజస్వీ సూర్య తప్పుబట్టారు. ఆయనకు ఇలాంటి సలహా ఎవరు ఇచ్చారో తెలియడం లేదని, రేవంత్ వాదనలకు తెలంగాణ ప్రజలు కూడా నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రాల ఆదాయం ఏటా మారుతుందని, నియోజకవర్గాల పునర్విభజనకు జీఎస్డీపీని ముడిపెట్టడం మూర్ఖత్వం అవుతుందని అన్నారు.
రాజ్యాంగం ప్రకారం ఒకరికి ఒక ఓటు ఉంటుందని, ఆదాయం ప్రకారం ఓట్లు ఇస్తే అంబానీకి లక్ష ఓట్లు ఇవ్వాలని అన్నారు. ‘ధనవంతులకు ఎక్కువ ఓట్లు, పేదలకు సున్నా ఓట్లు’ అనే తర్కం ప్రకారం ‘ముఖేష్ అంబానీకి లక్ష ఓట్లు, మనలాంటి వారికి ఒక్క ఓటు మాత్రమే’ వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
పేద, ధనిక, కుల, మత తారతమ్యాలు లేకుండా భారత రాజ్యాంగం దేశంలోని ప్రతి ఒక్కరికి ఓటు అనే గొప్ప సూత్రాన్ని అందించిందని అన్నారు. దానిని మార్చాలని భావించడం అజ్ఞానమే అవుతుందని ఆయన విమర్శించారు. బీజేపీ నాయకత్వంలోని మోదీ ప్రభుత్వం మహిళలకు చట్ట సభల్లో రిజర్వేషన్లను కల్పించే ప్రక్రియను 2029 ఎన్నికల నుంచి అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటుచేసి.. మూడు బిల్లులను లోక్‌సభలో గురువారం ప్రవేశపెట్టింది. లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు, పునర్విభజన కోసం 131 రాజ్యాంగ సవరణ చేపట్టనుంది. దీని ప్రకారం ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాలను 50 శాతం అంటే 815కు పెంచనున్నారు. ఈ పెంపుతో మహిళలకు 272 సీట్లు లభిస్తాయని కేంద్రం చెబుతోంది. అయితే, ఈ ప్రక్రియను 2011 జనాభా లెక్కల ప్రకారం చేపట్టడం పట్ల విపక్షాలు ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ప్రారంభమైన జనాభా లెక్కలు పూర్తయిన తర్వాతే ముందుకెళ్లాలని అంటున్నారు.
