Heavy Rains: ఏపీలో వారం రోజుల పాటు భారీ వర్షాలు

ఏపీలో మరో వారం రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల మూడో తేదీన అంటే శుక్రవారం నాటికి వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం ప్రభావంతో వచ్చే వారం రోజులు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఉత్తర కోస్తా జిల్లాలలో మోస్తరు వానల నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు […]

Published By: HashtagU Telugu Desk
Heavy rains in AP for a week

Heavy rains in AP for a week

ఏపీలో మరో వారం రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల మూడో తేదీన అంటే శుక్రవారం నాటికి వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం ప్రభావంతో వచ్చే వారం రోజులు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఉత్తర కోస్తా జిల్లాలలో మోస్తరు వానల నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. కోస్తా తీరం వెంబడి ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

మరోవైపు అల్పపీడనం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. ఇప్పటికే చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులు కూడా వెంటనే తీరానికి చేరుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఈ సమయంలో అధికారుల సూచనలను పాటించాలని తెలిపారు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షాలు పెరగొచ్చునని, ప్రజలు అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.

మరోవైపు శుక్రవారం నాటికి వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గురువారం కూడా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలలో వానలు కురుస్తాయని వెల్లడించింది. గురువారం (జూలై 2) శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, పోలవరం జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. పిడుగులు పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మరోవైపు జూన్ నెలలో ఆశించిన మేరకు వర్షాలు కురవకపోవటంతో రైతులు నిరాశలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మరో వారం రోజులు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ ప్రకటన అన్నదాతలలో ఆనందం నింపుతోంది.

 

  Last Updated: 02 Jul 2026, 10:02 AM IST