Harish Kumar Gupta : హరీశ్ కుమార్ గుప్తా.. ఆంధ్రప్రదేశ్‌కు కొత్త డీజీపీగా నియమితులు కానున్నారు. ప్రస్తుత డీజీపీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు ఈ నెల 31న పదవీ విరమణ చేస్తారు. ఆ వెంటనే హరీశ్ కుమార్ గుప్తా ఏపీ పోలీస్ బాస్‌గా నియమితులు అవుతారు. తిరుమలరావు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఎండీగా కూడా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఆయన డీజీపీగా పదవీ విరమణ చేసిన తర్వాత ఆర్టీసీ ఎండీగా కొనసాగే అవకాశం ఉంది. వాస్తవానికి సీనియారిటీ లిస్టులో 1991 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అగ్నిమాపకశాఖ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ మొదటి స్థానంలో ఉన్నారు. అయితే ఈ లిస్టులో రెండో స్థానంలో ఉన్న ఐపీఎస్ అధికారి హరీశ్ కుమార్ గుప్తా(Harish Kumar Gupta) వైపు సీఎం చంద్రబాబు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఆయనకే డీజీపీ పోస్టు దక్కే అవకాశాలు ఉన్నాయి.
Also Read :Death Threats : కపిల్ శర్మ సహా నలుగురు సెలబ్రిటీలకు హత్య బెదిరింపు.. ఆ ఈమెయిల్‌లో ఏముంది ?
ప్రస్తుతం విజిలెన్స్ విభాగంలో..
- ఏపీ నూతన డీజీపీ కాబోతున్న హరీశ్ కుమార్ గుప్తా 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి.
- ప్రస్తుతం హరీశ్ కుమార్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం డీజీగా ఉన్నారు.
- సీనియర్ ఐపీఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్ గతంలో జగన్ హయాంలో ఆర్టీసీ ఎండీగా పని చేశారు. ఆ సమయంలో ఒక వివాదంలో ప్రభుత్వం ఆయనపై విచారణకు ఆదేశించింది. ప్రస్తుత ప్రభుత్వం ఆయనపై విచారణ నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
- మాదిరెడ్డి ప్రతాప్ గతంలో విచారణను ఎదుర్కొన్న అంశం అనేది హరీశ్ కుమార్ గుప్తా ఎంపికకు మార్గం సుగమం చేసింది.
- ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల సమయంలో అప్పటి డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని ఎన్నికల సంఘం బదిలీ చేసింది. దీంతో ఆయన స్థానంలో హరీశ్ కుమార్ గుప్తాను ఎన్నికల సంఘం డీజీపీగా నియమించింది.
- ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణం చేసిన టైం ఆయన డీజీపీ పోస్టులో ఉన్నారు.
- ఆ తర్వాత కూటమి ప్రభుత్వ ప్రభుత్వం హరీశ్ స్థానంలో సీహెచ్ ద్వారకా తిరుమలరావును డీజీపీగా నియమించింది.
- ఇటీవలే రాష్ట్రవ్యాప్తంగా ఐపీఎస్‌ల బదిలీలు జరిగాయి. కొంతకాలంగా వెయిటింగ్‌లో ఉన్న ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్‌లు దక్కాయి.
- చంద్రబాబు స్విట్జర్లాండ్ (దావోస్ నగరం) నుంచి ఏపీకి తిరిగి వచ్చాక కొత్త డీజీపీ ఎంపికపై క్లారిటీ ఇవ్వనున్నారు.