రాయలసీమకు మరో భారీ ప్రాజెక్టు వచ్చింది. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రాజెక్టు నిర్మాణానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చంద్రబాబు శంకుస్థాపన చేశారు. రూ.15,803 కోట్లతో 650 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 7,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మరికొన్ని ప్రాజెక్టులకు పుట్టపర్తి నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.
ఆంధ్రప్రదేశ్‌కు మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు కీలక ముందడుగు పడింది. రాయలసీమ ప్రాంతంలో యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఐదో తరం స్టెల్త్ యుద్ధ విమాన తయారీ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టును రూ.15,803 కోట్లతో ఏడీఏ (ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ), డీఆర్‌డీవోల భాగస్వామ్యంతో ఏఎంసీఏ (అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్) ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 600 ఎకరాల్లో దీనిని ఏర్పాటు చేయనున్నారు. దాదాపు 7,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు.
మన దేశానికి ఆంధ్రప్రదేశ్ రక్షణ కవచంగా నిలబడబోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కేంద్రం సహకారంతో రాయలసీమ రూపురేఖలు మారబోతున్నాయన్నారు. పుట్టపర్తి భవిష్యత్తులో దేశం గర్వించే రక్షణ కేంద్రంగా కాబోతోందన్నారు. పుట్టపర్తి పేరు చెబితే సత్యసాయిబాబా గుర్తొస్తారని.. ఇప్పుడు యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టుతో దేశవ్యాప్తంగా ఆ పేరు వినిపిస్తుందన్నారు. రాయలసీమ రూపు రేఖల్ని కేంద్రం సహకారంతో మార్చబోతున్నామని.. మళ్లీ రాయలసీమను రతనాలసీమగా మార్చే బాధ్యతను తీసుకుంటామని అన్నారు. రాయలసీమలోనే త్వరలో బంగారం కూడా ఉత్పత్తి కాబోతోందన్నారు.
ఎన్నికల్లో ఎన్డీఏ క్లీన్ స్వీప్ చేసినందుకు ఉమ్మడి అనంతపురం జిల్లాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నామని మంత్రి లోకేష్ అన్నారు. గతంలో కరువు నేలపై కార్లు పరిగెత్తించి.. ఇప్పుడు ఫైటర్ జెట్స్ ఎగిరేలా చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు అని అన్నారు. ఏఎంసీఏ ప్రాజెక్టుతో ఉమ్మడి అనంతపురం జిల్లా అభివృద్ధిలో నెంబర్ 1 కావడం ఖాయమని అన్నారు. ఒకప్పుడు చిన్న ప్రాంతంగా ఉన్న పుట్టపర్తి ఇప్పుడు గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా మారిందని అన్నారు. 1991లో పుట్టపర్తిలో ఎయిర్‌పోర్ట్ నిర్మిస్తుంటే ఆశ్చర్యంగా చూశారని.. సత్యసాయిబాబా విజన్ ఏంటో ఇప్పుడు అందరికీ అర్థమవుతుందని అన్నారు. రాయలసీమకు పెట్టుబడులు క్యూ కట్టాయని.. త్వరలోనే హైకోర్టు బెంచ్ కూడా ఏర్పాటు కాబోతోందని చెప్పుకొచ్చారు. పుట్టపర్తిలో ఫైటర్ జెట్స్ ప్రాజెక్టులతో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏమిటో దేశానికి చూపించామని అన్నారు. రాష్ట్రాన్ని పెట్టుబడులకు కేంద్రంగా మార్చామని మంత్రి లోకేష్ అన్నారు.
పుట్టపర్తి వేదికగా మరికొన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఏఎంసీఏ ప్రాజెక్టుతోపాటు డిఫెన్స్‌కు సంబంధించిన మరో 4 ప్రాజెక్టులు, కర్నూలు డ్రోన్ సిటీలో 8 ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుల ద్వారా రూ.4,145 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. అలాగే దాదాపు 6,071 మందికి ఉపాధి లభిస్తుందని చెబుతున్నారు. అలాగే శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో రెండు ప్రాజెక్టులు, ప్రకాశం జిల్లా దొనకొండ, నెల్లూరులో ఒక్కో ప్రాజెక్టు చొప్పున ఏర్పాటు చేయనున్నారు.
