Pawan Kalyan Warns: మూడు పెళ్లిళ్లు మీరూ చేసుకోండి.. ఎవరు వద్దన్నారు?

విశాఖలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎయిర్‌పోర్టులో జనసేన, వైసీపీ పార్టీల మధ్య ఉద్రిక్త పరిస్థితుల తరువాత పోలీసులు కొందరు

  • Written By:
  • Updated On - October 17, 2022 / 12:11 PM IST

విశాఖలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎయిర్‌పోర్టులో జనసేన, వైసీపీ పార్టీల మధ్య ఉద్రిక్త పరిస్థితుల తరువాత పోలీసులు కొందరు జనసేన కార్యకర్తలను, నాయకులను అరెస్టు చేశారు. ఆదివారం పోర్టు కళావాహిని స్టేడియంలో ప్రజా సమస్యలను వినతుల రూపంలో స్వీకరించే జనసేన పార్టీ జనవాణి కార్యక్రమం జరగాల్సి ఉంది. దీనికి హాజరు కావడానికి పవన్ కల్యాణ్ శనివారమే వైజాగ్ వచ్చారు. అయితే, పవన్ బస చేసిన నోవాటెల్ హోటల్ నుంచి ర్యాలీ చేయకుండా, మామూలుగా వెళ్లాలని పవన్‌కు పోలీసులు సూచించారు. కానీ తాను ర్యాలీగానే వెళతానని పవన్ పోలీసులకు చెప్పారు. ఈ విషయంలో పోలీసులు, పవన్ కళ్యాణ్ మధ్య చర్చలు జరిగాయి. అనంతరం, జనవాణి కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు పవన్ కల్యాణ్ మీడియా సమావేశంలో తెలిపారు. దీన్ని అనేక ప్రాంతాల్లో నిర్వహించాం కానీ ఇక్కడ వైసీపీ నేతలు అడ్డుకోవడం అన్యాయమని అన్నారు.

“రాష్ట్రంలో అధికారం ఒక వ్యక్తి చేతిలో కేంద్రీకృతమై ఉంది. వీళ్లు వికేంద్రీకరణ గురించి మాట్లాడటం సిగ్గుచేటు. జనవాణి అంటే ప్రజల సమస్యల్ని వినేందుకు ప్రతిపక్షంగా చిత్తశుద్ధితో నిర్వహిస్తున్న కార్యక్రమం. దీన్ని అనేక ప్రాంతాల్లో నిర్వహించాం ఇక్కడ అడ్డుకోవడం అన్యాయం. 30 మంది ఎంపిలు, 151మంది ఎమ్మేల్యేలు ఉండి కూడా ఏమీ చేయలేకపోయారు” అని పవన్ కల్యాణ్ అన్నారు.మరోవైపు పోలీస్ యాక్ట్ ప్రకారం అనుమతి లేకుండా ర్యాలీలు, ఊరేగింపులు తీయకూడదని, అందుకే దీనిపై పవన్ కల్యాణ్‌కు నోటీసులు ఇచ్చామని విశాఖ పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ బీబీసీకి తెలిపారు. జనసేన సభ్యులు 100 మందిని అరెస్ట్ చేశారంటూ పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్‌లో పోలీసులపై విమర్శలు చేశారు.”మా పార్టీ కార్యక్రమాలు ఏంటో ఎక్కడికి వెళ్తున్నామో వైసీపీకి చెప్పాలా? వాళ్లు మాకు అలాగే చెప్పి చేస్తున్నారా? గంజాయి సాగు చేసే వారిని, వారికి అండదండలు అందిస్తున్న రాజకీయ నాయకుల్ని వదిలేయండి. ప్రజా సమస్యలపై పోరాడే నాలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టండి” అంటూ పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.‘‘ఈ ఉత్తరాంధ్ర పర్యటన మూడు నెలల క్రితమే నిర్దారించాం. మూడు రాజధానుల కార్యక్రమం కంటే మూడు రోజుల ముందే ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాం.

Also Read:   Revanth Reddy Reaction: బీజేపీ గెలుపు కోసమే పార్టీ ఫిరాయింపులు.. కేసీఆర్ పై రేవంత్ ఫైర్!

అసలు మా పార్టీ కార్యక్రమాలు ఎలా నడపాలో వైసీపీ కి చెప్పాలా? జనవాణి అంటే జనం పడుతున్న బాధలు, వారి సమస్యలను వెలుగులో తెచ్చే ప్రయత్నం. ఎంపీలు, ఎమ్మెల్యేలను చేతిలో ఉంచుకొని ప్రజాసమస్యలు పక్కన బెట్టి ఎంతసేపూ బూతులు మాట్లాడుతూ వైసీపీ కాలయాపన చేయడం వల్లనే జనవాణి పెట్టాల్సి వచ్చింది’’ అని పవన్ కల్యాణ్ అన్నారు.‘‘మా నాన్న పోలీస్ కానిస్టేబుల్. అందుకే పోలీసులంటే నాకు అభిమానం. పోలీసులు, పైనున్న రాజకీయ నాయకుల ఆర్డర్స్ ఫాలో అవుతారు. మీరు అంత చిత్తశుద్ధితో పనిచేసేవారైతే, వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఎందుకు పరిష్కరించలేకపోయారు? ఏపీ పోలీస్ మీద నమ్మకం లేదన్న జగన్ కింద మీరు పని చేస్తున్నారని గుర్తు ఉంచుకోండి. గంజాయి స్మగ్లర్లునూ, వారిని వెంటేసు కొచ్చే రాజకీయ నేతలను వదిలేసి, ప్రజాస్వామ్యయుతంగా జనవాణి జరిపే మమ్మల్ని వేధిస్తున్నారా?” అంటూ ఆయన పోలీసులపై విరుచుకు పడ్డారు.‘‘ఈ పర్యటనలో మాకు అసలు అమరావతి లేదా మూడు రాజధానుల మీద ఎజెండానే లేదు. అసలు 2014లోనే విశాఖే రాజధాని అంటే సరిపోయేది కదా. అధికార వికేంద్రీకరణ కోరుకుంటే, ముందు ప్రభుత్వంలోని 48 శాఖలు, 26 మంత్రులు, 5గురు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు కదా.. వీరికి అధికారం ఎందుకు పంచరు? మొత్తం అధికారం అంతా ఒకరి దగ్గరే ఎందుకు పెట్టుకున్నారు? వైసీపీ నేతలు చిలక పలుకుల్లా.. చిలుక బూతులు మాట్లాడుతున్నారు. ఏ బూతులు మాట్లాడాలో వీరికి పైనుండి రాసి ఇస్తున్నారు’’ అని పవన్ కల్యాణ్ విమర్శించారు.

‘‘కులానికో కార్పొరేషన్ పెడతారు, కానీ ఏ ఒక్కదానికీ నిధులు ఇవ్వరు. ఇదంతా కేవలం ఒక్క వ్యక్తి చేతిలోనే ఉన్నాయి. బూతులు తిట్టడానికి మాత్రమే వికేంద్రీకరణ పాటిస్తున్నారు. ఆ ఒక్కడు వల్ల చాలా కంపెనీలు ఏపీ నుండి వెళ్లిపోయాయి. రాష్ట్రంలో ఏం నడవాలి అన్నది కేవలం ఒక్క కుటుంబం మాత్రమే నిర్ణయిస్తుంది. అసలు అధికారంలో ఉన్నవాడు గర్జించడం ఏంటి? కడుపు కాలిన వాడు కదా అరవాలి, గర్జించాలి’’.‘‘పోలీసులు నన్ను రెచ్చగొట్టే ప్రయత్భం తీవ్రంగా చేశారు. నేను వైసిపీ గుండా గాళ్ల బెదిరింపులకు భయపడేది లేదు. సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా, వైసీపీ వాళ్ళు నన్ను చాలా సార్లు బెదిరించే ప్రయత్నం చేసారు’’.‘‘ర్యాలీ చేసినందుకు వందల మందిని అన్యాయంగా అరెస్టు చేశారు. సంబంధం లేని వాళ్ళను కూడా అదుపులోకి తీసుకున్నారు. మా కెమెరాలు తీసుకుపోయారు. నా కారు తాళాలు పోలీసులకు ఎందుకు అసలు ? రెచ్చగొట్టడానికి కావాలంటే నా దగ్గరా చాలా ఆయుధాలు ఉన్నాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు కావాలని, ప్రత్యేక రైల్వే జోన్ కావాలని జగన్ ఎంపీగా ఉన్నప్పుడు ఎందుకు అడగలేదు? అరెస్ట్ చేసిన మా నాయకులను బేషరతుగా విడుదల చేసే వరకూ జనవాణి నిలుపుదల చేస్తున్నాం. ఒకవేళ వదలక పోతే మా కార్యాచరణ ఏంటో తెలియ జేస్తాం’’ అన్నారాయన.

Also Read:   Janasena & TDP : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు చంద్ర‌బాబు ఫోన్‌.. నేత‌ల అరెస్టుల‌ను ఖండించిన బాబు

ప్రజా ఉద్యమాలను వైసిపీ తట్టుకోలేదని, వైజాగ్‌ను క్రొత్తగా డెవలప్ చేసే అవసరం ఏముందని ప్రశ్నించిన ఆయన, శ్రీకాకుళంలో రాజధాని పెడితే, నేను వద్దనే ధైర్యం కూడా చెయ్యనని అన్నారు.‘‘మాట్లాడితే నేను మూడు పెళ్లిళ్లు చేసుకున్నానంటారు. మీరూ చేసుకోండి. ఎవరు వద్దన్నారు? నాకు కుదరలేదు అందుకే చట్ట బద్దంగా విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకున్నా. బహుశా వైసీపీ నేతలకు నేను మూడు పెళ్లిళ్లు చేసుకున్నానని అసూయ ఉండొచ్చు. అందుకే మాట్లాడితే ఆ టాపిక్ ఎత్తుతున్నారు” అని పవన్ కల్యాణ్ అన్నారు. అకారణంగా అరెస్ట్ చేసిన నాయకులను విడిపించాలని పవన్ డిమాండ్ చేసారు. ప్రజా ఉద్యమాన్ని వైసీపీ ఎదుర్కోలేదని విమర్శించారు. జనవాణి నిర్వహించాలన్న పవన్ కల్యాణ్ ప్రయత్నాలను ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తప్పుబట్టారు. విశాఖకు రాజధాని రాకుండా అడ్డుకోవాలన్నదే ఆయన ప్రయత్నమని బొత్స విమర్శించారు. విశాఖలో జరిగిన గర్జన విశాఖ ప్రజల ఆకాంక్షలకు నిదర్శనమని ఆయన అన్నారు.

”కొన్ని పార్టీలకు, పత్రికలకు ఎందుకు ఉత్తరాంధ్ర మీద, విశాఖ మీద అంత కక్ష” అని ఆయన ప్రశ్నించారు. మా ప్రాంతానికి వచ్చి మమ్మల్ని తిడితే జనం ఊరుకుంటారా అని ఆయన అన్నారు.”జనసేన రాజకీయ పార్టీ కాదు, అందులో ఉన్నది చిల్లర బ్యాచ్” అని బొత్స విమర్శించారు. నిన్నటి ఘటనలకు బాధ్యత వహించకుండా పవన్ కల్యాణ్ ఏ మొఖం పెట్టుకుని మాట్లాడుతారని మంత్రి ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ కు ప్రజల పట్ల, అభివృద్ధిపట్ల చిత్తశుద్ధి లేదని ఆరోపించారు.

Also Read:    AP : రాళ్లదాడి ఘటనలో జనసేనకు ఊరట…61మందికి బెయిల్..!!