Site icon HashtagU Telugu

Garlic Price : వెల్లుల్లి కిలో రూ.450.. ధర ఎందుకు పెరిగింది ? ఎప్పుడు తగ్గుతుంది ?

Garlic Price Hike

Garlic Price : వెల్లుల్లి.. ఈ పదం వింటేనే పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు వణికిపోతున్నారు. దాని ధర అంతగా పెరిగిపోయింది మరి. ప్రస్తుతం కిలో వెల్లుల్లి రేటు రూ.450 దాకా ఉంది. దీంతో దాన్ని కొనేందుకు సామాన్యులు సాహసించడం లేదు. ఈక్రమంలో రెడీమేడ్‌గా లభించే అల్లం,వెల్లుల్లి పేస్టులకు గిరాకీ బాగా పెరిగింది. అయితే అవి నాణ్యంగా ఉండటం లేదు. వాటిలో బంగాళాదుంపలు వంటివి కలిపి తయారు చేస్తున్నారు. ఈ కారణం వల్లే అల్లం,వెల్లుల్లి రెడీమేడ్ పేస్టుల ధరలు చాలా తక్కువగా ఉంటున్నాయి. కల్తీ జరిగినందున వీటి టేస్టు కూడా ఏమీ ఉండదు.రెడీమేడ్‌గా అల్లం,వెల్లుల్లి పేస్టులు తయారుచేసే సంస్థలపై ఆహార నియంత్రణ విభాగం తనిఖీలు అంతగా జరిగిన దాఖలాలు లేవు. ప్రజారోగ్యానికి సంబంధించిన అంశం కాబట్టి.. వాటి తయారీ సంస్థలపై అధికారులు ఫోకస్ చేస్తే బాగుంటుంది.

Also Read :IT Raids : సినీ నిర్మాతలు, డైరెక్టర్లపై మూడో రోజూ కొనసాగుతున్న ఐటీ రైడ్స్

వెల్లుల్లి ధరలు ఎందుకు పెరిగాయి ? 

  • వెల్లుల్లి(Garlic Price) పంట మన దేశంలో అత్యధికంగా మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో సాగు అవుతోంది. దీని తర్వాతి స్థానాల్లో రాజస్థాన్, గుజరాత్‌ ఉన్నాయి.
  • గతేడాది వెల్లుల్లికి తగిన ధర రాలేదు. దీంతో రైతులకు నిరాశకు గురయ్యారు. చాలామంది రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లారు. దీంతో 2024 సంవత్సరంలో వెల్లుల్లి సాగు విస్తీర్ణం తగ్గిపోయింది.
  • మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, పిప్లే, ఉజ్జయిని, దలోదా తదితర ప్రాంతాల నుంచి వ్యాపారులు వెల్లుల్లిని ఏపీలోని తాడేపల్లిగూడెంలో ఉన్న హోల్‌సేల్‌ మార్కెట్‌కు తీసుకొస్తుంటారు. ఈ మార్కెట్ నుంచే ఉమ్మడి ఉభయ గోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, కృష్ణాజిల్లాల్లోని రిటైల్‌ మార్కెట్‌లకు సప్లై చేస్తారు.
  • తాడేపల్లిగూడెం మార్కెట్‌కు గతంలో రోజుకు 150 టన్నుల వరకు వెల్లుల్లి వచ్చేది.  అయితే ఇప్పుడు అంతగా వెల్లుల్లి రావడం లేదు.
  • ఈ మార్కెట్‌కు వస్తున్న కొద్దిపాటి వెల్లుల్లిని వ్యాపారులు భారీగా స్టాక్ చేస్తున్నారు. దీంతో కృత్రిమ కొరత ఏర్పడుతోంది. ఫలితంగా ధర పెరుగుతోంది.
  • వారం పదిరోజుల కిందటి వరకు క్వాలిటీ మేరకు వెల్లుల్లి హోల్‌సేల్‌  ధర కిలోకు రూ.180 నుంచి రూ.380 వరకు ఉంది. రిటైల్‌ మార్కెట్‌లోకి క్వాలిటీ వెల్లుల్లి ధర కిలోకు రూ.450 దాకా పలికింది.
  • కొత్త వెల్లుల్లి పాయల్లో తేమ ఎక్కువ ఉంటుంది. అందువల్ల అది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ప్రస్తుతం కొత్త పంట మార్కెట్లోకి వస్తోంది.
  • మరో మూడు నెలల తర్వాత మధ్యప్రదేశ్‌ నుంచి ఆరబెట్టిన వెల్లుల్లి తాడేపల్లిగూడెం మార్కెట్‌‌కు వస్తుంది. ఆ తర్వాతే దీని ధరలు తగ్గే ఛాన్స్ ఉంది.
  • సరిగ్గా దిగుమతులు లేక ఉల్లి ధర కూడా తగ్గడం లేదు. నాసిక్, షోలాపూర్‌ నుంచి తాడేపల్లిగూడెం హోల్‌సేల్‌ మార్కెట్‌కు రోజుకు 150 టన్నులు ఉల్లిపాయలు వస్తున్నాయి. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లోని ఏలూరు, కాకినాడ, రాజమహేంద్రవరం, భీమవరం, మండపేట, నరసాపురం తదితర ప్రాంతాలకు ఇక్కడి నుంచే రిటైల్‌ వ్యాపారులు తీసుకెళ్తారు.
  • హోల్‌సేల్‌‌లో ఉల్లి ధర కిలోకు రూ.35 వరకు ఉంది. దీని ధర రిటైల్‌ మార్కెట్‌లో రూ.50 వరకు ఉంది.