Fire Broke Out in RTC Bus Tirupati : నెల్లూరు జిల్లాలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. తిరుపతి నుండి వినుకొండకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగడం ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. నెల్లూరు జిల్లా నాయుడుపేట సమీపంలోని విన్నమాల వద్ద ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి కలకలం సృష్టించాయి. తిరుపతి డిపోకు చెందిన ఈ బస్సు 29 మంది ప్రయాణికులతో వినుకొండకు బయలుదేరింది. ప్రయాణం సాఫీగా సాగుతున్న సమయంలో, ఒక్కసారిగా బస్సు వెనుక భాగం నుంచి పొగలు, మంటలు రావడం గమనించారు. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును రోడ్డు పక్కన నిలిపివేయడంతో, ప్రయాణికులందరూ హుటాహుటిన కిందకు దిగి ప్రాణాలు దక్కించుకున్నారు. సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల ఒక పెద్ద ప్రాణ నష్టం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ప్రమాదం వెలుగులోకి రావడానికి ఒక ప్రయాణికుడి అప్రమత్తత ప్రధాన కారణమైంది. బస్సు వెనుక సీటులో కూర్చున్న ఓ ప్రయాణికుడు టికెట్ తీసుకోవడం కోసం సీటులోంచి లేచినప్పుడు, ఇంజిన్ వైపు నుంచి మంటలు రావడం గమనించారు. వెంటనే ఆయన కేకలు వేస్తూ తోటి ప్రయాణికులను, బస్సు సిబ్బందిని అలర్ట్ చేశారు. దీంతో క్షణాల్లోనే అందరూ సురక్షితంగా బయటకు రాగలిగారు. వారు దిగిన కొద్దిసేపటికే మంటలు బస్సును చుట్టుముట్టాయి. ఒకవేళ ఆ ప్రయాణికుడు గమనించకపోతే, గాఢ నిద్రలో ఉన్న వారికి లేదా అసలు విషయం తెలియని వారికి భారీ ముప్పు వాటిల్లేదని అధికారులు భావిస్తున్నారు.
ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రాథమిక అంచనా ప్రకారం, షార్ట్ సర్క్యూట్ లేదా ఇంజిన్ ఓవర్ హీట్ అవ్వడం వల్లే ఈ అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ప్రయాణికులను మరో బస్సులో వారి గమ్యస్థానాలకు పంపేలా ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేశారు. బస్సు ఫిట్‌నెస్ మరియు నిర్వహణ లోపాలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.
