ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంగళగిరి-తాడేపల్లి మున్సిపాల్ కార్పొరేషన్ తాగునీటి సమస్యకు చెక్ పెట్టే పనిలో ఉంది. 24 గంటలూ నీరు సరఫరా చేసే ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తం రూ.393 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నారు. భవిష్యత్ అవసరాలను కూడా గుర్తించి అందుకు తగిన విధంగా ప్రాజెక్టును ప్లాన్ చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతి ప్రాంతంలో తాగునీటి సమస్యలకు చెక్ పెట్టే పనిలో ఉంది. రాజధాని ప్రాంతంలోని మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ (ఎంటీఎంసీ)లో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించబోతోంది. ఏకంగా రూ.393.74 కోట్లతో శాశ్వత తాగునీటి సరఫరా పథకాన్ని అమలు చేయబోతోంది. మొత్తం 40 డివిజన్లు ఉండగా.. వాటిలోని 29 జోన్‌లలో పైప్‌లైన్లలో 24 గంటలూ సురక్షిత తాగునీటిని సరఫరా చేయనున్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీఏలు కలిసి సమన్వయంతో ఈ ప్రాజెక్టను తీసుకొస్తున్నారు. ఈ తాగునీటి పథకానికి సంబంధించి త్వరలోనే పనులు ప్రారంభించనున్నారు.
మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో ప్రస్తుతం 2.67 లక్షల జనాభా ఉన్నారు.. అయితే 2055 నాటికి జనాభా 4.47 లక్షల వరకు చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని రోజూ 88.5 మిలియన్ లీటర్ల నీరు కావాలని అంచనా వేశారు అధికారులు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా హెచ్‌డీపీఈ పంపిణీ పైప్‌లైన్ నెట్‌వర్క్‌ను మొత్తం 644 కిలోమీటర్లు ఏర్పాటు చేయనున్నారు. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ కోసం ఈఎల్‌ఎస్‌ఆర్‌లు (27 కొత్త ఎలివేటెడ్ సర్వీస్ రిజర్వాయర్లు) నిర్మించనున్నారు. ప్రస్తుతం మూడు రిజర్వాయర్లు ఉన్నాయి.. వీటితో కలిపి మొత్తం 30 ఈఎల్‌ఎస్‌ఆర్‌లు అందుబాటులో ఉంటాయి. మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్‌లో కొత్తగా 19 వేలకుపైగా ఇళ్లకు కొత్తగా కుళాయి కనెక్షన్లు ఇవ్వాలని ప్లాన్ చేశారు. నగరంలోని ప్రాంతాలతో పాటుగా గ్రామాలనకు కూడా నీటిని సరఫరా చేసేందుకు జోన్ వ్యవస్థను కూడా తీసుకురానున్నారు.
ఈ ప్రాజెక్ట్ కోసం ఈ మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్‌లో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ కోసం యూఐడీఎఫ్ నుంచి రూ.287.54 కోట్లు, అమృత్ 2.0లో రూ.51.20 కోట్లు, సీఆర్‌డీఏ నుంచి రూ.55 కోట్లు సమకూరనున్నాయి. సీఆర్డీఏకి సంబంధించిన రింగ్ మెయిన్ల ద్వారా ప్యూరిఫై చేసిన నీళ్లను రోజూ అందిస్తారు. రాజధాని ప్రాంతంలో ఉన్న ఉండవల్లిలో ఉన్న ట్యాపింగ్ పాయింట్ నుంచి తాడేపల్లికి నీళ్లు సరఫరా చేస్తారు. అమరావతిలో ఉన్న ఎంఐజీ లేఅవుట్ దగ్గర మరో పాయింట్ నుంచి మంగళగిరికి నీరు సరఫరా చేస్తారు. వాటర్ ప్యూరిఫైర్ ప్లాంట్, రా వాటర్ అవసరం లేకపోవడంతో ప్రాజెక్టు అంచనా వ్యయంలో రూ.56.50 కోట్లు ఆదా అయినట్లు చెబుతున్నారు. మొత్తం మీద రాజధాని ప్రాంతంలో తాగునీటి సమస్యకు పరిష్కారం దొరికింది.
