Devaragattu : కర్నూలు జిల్లా దేవరగట్టులో దసరా పండుగ వెరీవెరీ స్పెషల్. అక్కడ జరిగే కర్రల సమరానికి వేళ అయింది. దసరా రోజు అర్ధరాత్రి 12 గంటలకు దేవరగట్టు వద్ద కొండపై వెలిసిన మాళ మల్లేశ్వరస్వామి ఆలయంలోని మాళమ్మ, మల్లేశ్వరస్వామికి కల్యాణం జరిపిస్తారు. కల్యాణం అనంతరం పాదాలగట్టు, రక్షపడ, బసవన్నగుడి ప్రాంతాల్లో ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తారు. ఈక్రమంలోనే విగ్రహాలను దక్కించుకోవడం కోసం నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామాల ప్రజలు ఒక జట్టుగా ఏర్పడతారు. ఆలూరు, సుళువాయి, ఎల్లార్తి, నిడ్రవట్టి, అరికెర, బిలేహాల్ గ్రామస్తులు మరో జట్టుగా (Devaragattu) ఏర్పడతారు. వీరు పరస్పరం కర్రలతో తలపడతారు. దీన్నే బన్నీ ఉత్సవం అని పిలుస్తారు. ఈ ఉత్సవంలో ఎంతమందికి గాయాలైనా ఆచారాన్ని మాత్రం వదిలిపెట్టరు.
ఈసారి సాధ్యమైనంత తక్కువ మందికి గాయాలయ్యేలా చూడాలనే పట్టుదలతో పోలీసులు ఉన్నారు. ఇందుకోసం దేవరగట్టులో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పెద్దసంఖ్యలో సిబ్బందిని మోహరించారు. బన్నీ ఉత్సవం జరిగే అన్ని ఏరియాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. డ్రోన్ల ద్వారా ఉత్సవాల ఫుటేజీని ఎప్పటికప్పుడు రికార్డు చేయనున్నారు. అధికారులు, పోలీసులు కలిసి ఆయా గ్రామాల్లో అవగాహనా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. రింగులు తొడిగిన కర్రలను పలుచోట్ల నుంచి స్వాధీనం చేసుకున్నారు. బన్సీ ఉత్సవం జరిగే సమయంలో మద్యం విక్రయాలను ఆపేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఈ కర్రల సమరాన్ని చూసేందుకు తెలంగాణ, కర్ణాటక నుంచి కూడా ప్రజలు తరలిరావడం గమనార్హం. బన్నీ ఉత్సవాల్లో హింసను అరికట్టాలని గతంలో కోర్టులు ఆదేశాలిచ్చినా వాటి అమలుకు చర్యలు చేపట్టలేదు. మొత్తం మీద ఈ ఉత్సవం వల్ల ఎంతోమంది గాయాలపాలై ఆస్పత్రుల్లో చేరుతారు. కొందరి పరిస్థితి విషమించే ముప్పు కూడా లేకపోలేదు. ఇలాంటి హింసాత్మక ఉత్సవాలను ఆపాలని సామాజికవేత్తలు కోరుతున్నారు.