CM Chandrababu On Srivari Laddu Issue: తిరుమల పవిత్రతకు పూర్వవైభవం తీసుకొస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టమని హెచ్చరించారు. తప్పు చేసిన వారు చరిత్ర హీనులుగా మిగిలిపోయేలా కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. మీడియాతో చిట్‌చాట్‌లో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Rahul Gandhi : రాహుల్ గాంధీపై 3 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు
”తిరుమలకు 200 ఏళ్ల పైబడిన చరిత్ర ఉంది. ఇంట్లో స్వామి వారి లడ్డూ ఉంటే ఇళ్లంతా ఘుమఘులాడే వాసన వచ్చేది. అంతటి పవిత్రత, విశిష్టత ఉన్న లడ్డూను కల్తీ చేయడమే కాక జగన్ ఎదురుదాడి చేస్తారా? ప్రజలు గుణపాఠం చెప్పినా బుద్ధి మార్చుకోరా..? స్వామి వారి అన్న ప్రసాదం స్ఫూర్తితోనే అన్న క్యాంటీన్లు పెట్టాం. తిరుమల శ్రీవారి విషయంలో నేను ఒకటికి పదిసార్లు ఆలోచిస్తా. స్వామివారి విషయంలో అపచారం తలపెట్టే మాటలు పొరపాటున కూడా చేయం. వాస్తవాలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయనే బాధ నాకూ ఉంది. అలాగని గత పాలకులు చేసిన దుర్మార్గాలు చూస్తూ ఊరుకోవాలా?” అని చంద్రబాబు ప్రశ్నించారు.
కాగా, గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో లడ్డు తయారీ అపవిత్రంగా మారిందని, తయారీ పక్రియలో అపవిత్ర పదార్థాలు వాడిన అంశంపై తాము సీరియస్ గా విచారణ జరిపిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల ఆవేదనను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందన్నారు. తిరుమల పవిత్రత కాపాడే విషయంలో ఆగమ, వైదిక, ధార్మిక పరిషత్ లతో చర్చించి అవసరమైన చర్యలు చేపడతామని భక్తులకు సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.