TDP : టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ 43వ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ జెండా ఎగురవేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు, నారా లోకేశ్, పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నివాళి అర్పించారు. అనంతరం నిర్వహించిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ..తెలుగు జాతి ఉన్నంత కాలం టీడీపీ ఉంటుందని.. పార్టీకి తాము వారసులమే కానీ పెత్తందారులం కాదని కీలక వ్యాఖ్యలు చేశారు. నేను కూడా పార్టీకి అధ్యక్షుణ్ని.. టీమ్ లీడర్‌ను మాత్రమే. ప్రతి కార్యకర్తకు న్యాయం చేయాలి అన్నారు.
Read Also: Nara Lokesh: టీడీపీ కార్యకర్తలకు మంత్రి లోకేష్ కీలక హామీ.. ప్రమోషన్ ఇస్తా అంటూ వ్యాఖ్యలు!
పార్టీని లేకుండా చేయాలని చాలా మంది ప్రయత్నించారు. అలాంటి వారు కాలగర్భంలో కలిసిపోయారు. టీడీపీని ఏమీ చేయలేకపోయారు. ముహూర్త బలం చాలా గొప్పది. పార్టీ సంకల్ప బలం కూడా చాల గొప్పది. చరిత్రలో టీడీపీ నాటి స్వర్ణ యుగం అని చెప్పుకొనే రోజులు శాశ్వతంగా వస్తాయి. 43 ఏళ్లు ఎన్నో సంక్షోభాలు వచ్చాయి.. అవకాశంగా తీసుకుని విజయాలు సాధిస్తున్నాం. పార్టీనే ప్రాణంగా బతికే పసుపు సైన్యానికి మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నా అని చంద్రబాబు అన్నారు. పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారం దక్కించుకున్న ఏకైక పార్టీ టీడీపీ. పేదల సంక్షేమానికి నాంది పలికిన మహానుభావుడు ఎన్టీఆర్ అన్నారు.
ఆడపడుచులకు, అన్నదాతలకు, సామాన్యులకు అండగా నిలిచిన జెండా పసుపు జెండానే అని అన్నారు. అన్నదాతకు అండగా నాగలి, కార్మికులకు, పారిశ్రామిక ప్రగతికి చిహ్నం చక్రం అని తెలిపారు. నిరుపేదలకు అందించే ఇల్లు తమ జెండాలో ఉన్నాయని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో గుప్తుల కాలం గురించి చెప్పుకున్నట్లే టీడీపీ గురించి చెప్పుకుంటుంటారని అన్నారు. విద్య, విద్యుతత్ సంస్కరణలు తెచ్చింది టీడీపీనే అని.. సంపద వచ్చిందంటే ముందుచూపుతో పనిచేసే పార్టీ తమదేనని సీఎం చంద్రబాబు అన్నారు.