CM Chandrababu: ఢిల్లీలో జరిగిన సీఐఐ వార్షిక సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు (CM Chandrababu) పారిశ్రామికవేత్తలను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ‘ఆర్థికాభివృద్ధి – సుస్థిరత – ఆంధ్రప్రదేశ్ బ్లూప్రింట్’ అనే అంశంపై జరిగిన సీఐఐ స్పెషల్ ప్లీనరీ సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, రూపొందించిన విధానాలను వివరించారు. స్వర్ణాంధ్ర విజన్-2047లో పారిశ్రామిక భాగస్వామ్యాన్ని కోరుతూ ఆయన విజ్ఞప్తి చేశారు.
సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. “ప్రస్తుతం సీబీఎన్ బ్రాండ్ ద్వారా ఏపీకి పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాం. క్రెడిబిలిటీ రాత్రికి రాత్రి వచ్చేది కాదు. ఏపీకి రండి, పరిశీలించండి, ఆ తర్వాత పెట్టుబడులు పెట్టండి. 2026లో దేశంలోనే మొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ అమరావతిలో ఏర్పాటవుతుంది. దీన్ని పారిశ్రామికవేత్తలు వినియోగించుకోవాలి. క్వాంటమ్ కంప్యూటింగ్ విస్తరిస్తోంది. డ్రోన్స్, ఐఓటీ, సెన్సార్ల వంటి సాంకేతికతలతో రియల్-టైమ్ డేటా అందుబాటులోకి వస్తోంది. ఈ రంగాల్లో పెట్టుబడిదారులు అవసరం. భవిష్యత్తులో ఈ రంగానికి గొప్ప డిమాండ్ ఉంటుంది. అమరావతి దీనికి కేంద్రంగా నిలుస్తుంది. టీసీఎస్, ఐబీఎం, ఎల్ అండ్ టీ సంస్థలు సంయుక్తంగా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేస్తున్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నదే మా నినాదం. బీపీసీఎల్ రిఫైనరీ రామాయపట్నంలో ఏర్పాటవుతోంది. విశాఖలో డేటా సెంటర్, అనలిటిక్స్ క్యాంపస్‌ను ఏర్పాటు చేయాలని గూగుల్‌ను ఆహ్వానించాం. పారిశ్రామికవేత్తలు ఎవరు వచ్చినా ఎర్ర తివాచీతో స్వాగతిస్తాం. దరఖాస్తు నుంచి భూ కేటాయింపు, అనుమతుల వరకు రికార్డు సమయంలో క్లియరెన్సులు ఇస్తామని హామీ ఇస్తున్నాం. ఏపీ సౌర, పవన, పంప్డ్ ఎనర్జీ వంటి గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి కేంద్రంగా మారుతోంది. ఈ రంగంలో 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి. రాయలసీమలో హైటెక్ ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నాం, 5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చే లక్ష్యం ఉంది. అమరావతిలో గ్లోబల్ లీడర్‌షిప్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం, ఇది భవిష్యత్ నాయకులను తయారు చేస్తుంది” అని పారిశ్రామికవేత్తలకు వివరించారు.
Also Read: CM Chandrababu: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన!
నాడు-నేడు: ఆంధ్రప్రదేశ్ ప్రమోషన్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు తెచ్చిన అనుభవాన్ని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. “దావోస్ వంటి సదస్సులకు వెళ్తే ఓట్లు రావని కొందరు అన్నారు. అయినా ఉమ్మడి ఏపీ కోసం ఓట్లను పట్టించుకోకుండా ధైర్యంగా వెళ్లాను. 1995 నుంచి ప్రపంచ ఆర్థిక సదస్సులకు నిరంతరం హాజరవుతున్నాను. ప్రజా జీవితంలో ఉన్నవారు సంపద సృష్టించాలి. సంపద పెరిగితేనే సంక్షేమ పథకాలు అమలు చేయగలం. హైదరాబాద్‌లో సీఐఐ సహకారంతో గ్రీన్ బిల్డింగ్ నిర్మించాం, బహుళ పెట్టుబడి సదస్సులు నిర్వహించాం. ఇప్పుడు హైదరాబాద్ దేశంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరంగా నిలిచింది. 1991లో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమయ్యాయి. అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు నిర్ణయాలను అభినందిస్తాను. 1990 తర్వాత సమాచార, ఇంటర్నెట్ విప్లవం మొదలైంది. ఏపీలో అప్పటి సంస్కరణల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఐటీ నిపుణుల్లో 30 శాతం తెలుగువారే ఉన్నారు. నా అరెస్ట్ సమయంలో 80 దేశాల్లో తెలుగు ఐటీ ఉద్యోగులు వీధుల్లోకి వచ్చారు, అప్పుడే వారి విస్తృతి ప్రపంచానికి తెలిసింది. ఇప్పుడు విభజన ఆంధ్రప్రదేశ్‌ను ప్రమోట్ చేస్తున్నాను. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన నాకు అమరావతిని గ్లోబల్ గ్రీన్ సిటీగా నిర్మించే అవకాశం వచ్చింది. ఇందులో పరిశ్రమల భాగస్వామ్యం కోరుతున్నాం. 15 శాతం వృద్ధి రేటుతో ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని, తలసరి ఆదాయాన్ని రూ.55 లక్షలకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం” అని వివరించారు.
స్టాండింగ్ ఓవేషన్‌తో సత్కారం
సీఎం చంద్రబాబు ప్రసంగం, పారిశ్రామికవేత్తల ప్రశ్నలకు సమాధానాలు సీఐఐ సదస్సులో స్టాండింగ్ ఓవేషన్‌తో గౌరవించబడ్డాయి. సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ, అధ్యక్షుడు సంజీవ్ పురి, తదితరులు ఆయనను సత్కరించారు.